ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇక తరువాతి వంతు సీఎం అరవింద్ కేజ్రీవాల్ అని ఛీటర్ సుకేష్ చంద్రశేఖర్ అన్నాడు. ఈ కేసులో మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ ఇద్దరూ కేజ్రీవాల్ చేతిలో కీలుబొమ్మలని, తాను లిఖితపూర్వకంగా ఈ విషయాన్ని తెలియజేస్తున్నానని పేర్కొన్నాడు. ఈ కేసులో ఇక కేజ్రీవాల్ వంతు వస్తుందని, సిసోడియా, జైన్ లకు ఆయన ‘మాస్టర్’ అని ఆరోపించాడు.
వీరందరి బండారాలూ బయటపెడతానన్నాడు. 2015 నుంచే తాను వీరితో లావాదేవీలు నడుపుతున్నానని తెలిపాడు. సత్యం జయించింది.. ఇక అందరి సంగతి తేలుస్తా.. అని సుకేష్ చంద్రశేఖర్ ఆవేశంగా వ్యాఖ్యానించాడు.
తాను రూ. 50 కోట్లను ఆప్ నేతలకు చెల్లించానని ఇతగాడు లోగడ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కు రాసిన లేఖలో తెలిపాడు. ముఖ్యంగా సత్యేంద్ర జైన్, తీహార్ జైలు అధికారులు కలిసి తనను డబ్బుల కోసం ఎలా వేధించిందీ లోగడ పలు సందర్భాల్లో వివరించాడు.
జైల్లో తనకు భద్రత కల్పించేందుకు 2019 లోనే జైన్ తన నుంచి బలవంతంగా 10 కోట్లను రాబట్టారని చంద్రశేఖర్ ఆరోపించాడు. ఏమైనా లిక్కర్ స్కామ్ కేసు బయటపడింది గనుక కేజ్రీవాల్ సైతం తప్పించుకోలేరని ఆయన అంటున్నాడు.