తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ మాణిక్ రావు థాక్రేను ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గురువారం కలిశారు. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏఐసీసీ ఇచ్చిన షోకాజ్ నోటీసులు ఎప్పుడో చెత్తబుట్టలో పడ్డాయన్నారు. నోటీసులు ఏమీ లేవని, తన పని తాను చేసుకోవాలని మల్లికార్జున ఖర్గే తనతో చెప్పారని తెలిపారు. మానిక్ రావు థాక్రే చాలా మంచి వారని ఆయన గురించి తనకు, తన గురించి ఆయనకు బాగా తెలుసన్నారు వెంకట్ రెడ్డి.
నియోజకవర్గం పనుల్లో బిజీగా ఉండటం వల్లే గాంధీ భవన్ కు రాలేదన్నారు. సీతక్క, పొదం వీరయ్య, జగ్గారెడ్డి వంటి వారు కూడా బుధవారం జరిగిన సమావేశానికి రాలేదని.. వాళ్లను ఎందుకు అడగరని ఆయన మీడియాను ప్రశ్నించారు. గంటపాటు సాగిన భేటీలో భవిష్యత్తు పార్టీలో ఎలా ముందకు తీసుకువెళ్లాలనే దానిపై తాను అభిప్రాయాలను థాక్రేతో పంచుకున్నారని పేర్కొన్నారు.
పీసీసీ అభిప్రాయాలను థాక్రేతో పంచుకున్నానని, మా ఇద్దరి మధ్య పార్టీ గురించే చర్చ జరిగిందన్నారు. పీసీసీ కమిటీల్లో చోటు దక్కకపోవడంపై మరోసారి స్పందించిన వెంకట్ రెడ్డి.. ఆ కమిటీలను తాను పట్టించుకోనన్నారు.
నాలుగైదు సార్లు ఓడిపోయిన వారితో నేను పీసీసీ కమిటీలో కూర్చోవాలా? అని ప్రశ్నించారు. మా ఫోటోలను మార్ఫింగ్ చేసిన విషయాన్ని ఏఐసీసీనే పట్టించుకోవడంలేదన్నారు. నా ఫోటో మార్ఫింగ్ అయిందని స్వయానా సీపీ గారే నాకు చెప్పారని వెల్లడించారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.