దేశ, విదేశాల్లో తన ప్రతిష్ఠను దిగజార్చేందుకు కొందరు వ్యక్తులకు కొంతమంది ‘సుపారీ’ ఇచ్చారంటూ ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ మాజీ నేత, ప్రముఖ లాయర్ కపిల్ సిబల్ స్పందించారు. ఆ వ్యక్తుల పేర్లేవో చెప్పాలని, ఇది రహస్యంగా ఉండరాదని ఆయన అన్నారు. నిన్న భోపాల్-ఢిల్లీ వందే భారత్ రైలును మోడీ.. రాణి కమలాపతి త్రిపాఠీ రైల్వే స్టేషన్ లో ప్రారంభించిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీని దుయ్యబట్టారు.
మన దేశంలో కొందరు వ్యక్తులున్నారని, 2014 నుంచే వారు తన ప్రతిష్టను దిగజార్చుతామని బాహాటంగానే చెబుతున్నారని , ఇందుకు వారు కొంతమందికి ‘సుపారీ’ (కాంట్రాక్ట్) ఇచ్చారని ఆరోపించారు. వీరిలో కొందరు దేశంలో కూర్చుని మంత్రాంగం నడుపుతుండగా.. మరికొందరు విదేశాల్లో ఈ పని చేస్తున్నారన్నారు.
ఈ వ్యాఖ్యలపై కపిల్ సిబల్ .. ఆ వ్యక్తులు లేదా ఆ సంస్థలు లేక ఆ విదేశాలేవో మోడీ వివరించాలని కోరారు. ఇది రహస్యంగా ఉండరాదని, వారిని ప్రాసిక్యూట్ చేయాల్సిఉందని అన్నారు. ప్రధాని పట్ల కపిల్ సిబల్ ఇలా మెతక వైఖరితో మాట్లాడడం ఇదే మొదటిసారి.
అయితే సుపారీ ఇచ్చినంత మాత్రాన భయపడబోనని, తనకు ప్రజల్లోని అన్నివర్గాలూ రక్షణగా ఉన్నాయని మోడీ పేర్కొన్నారు. ఈ వందే భారత్ రైలును ఏప్రిల్ 1 న తాను ప్రారంభించబోనని, ప్రజలను ఏప్రిల్ ఫూల్స్ చేసేందుకే తాను దీన్ని ప్రకటించానని విపక్షాలు ప్రచారం చేశాయని, కానీ ఆ ప్రచారాన్ని తాను వమ్ము చేశానని ఆయన అన్నారు.