– కేసీఆర్ నమ్మకాలపై మోడీ టార్గెట్
– అంధవిశ్వాసాలతో రాష్ట్రానికి ఉపయోగం లేదంటూ సెటైర్లు
– క్యాంప్ ఆఫీస్, సచివాలయం కూల్చివేతలపై జోరుగా చర్చ
– హిందుత్వం ముసుగులో డ్రామాలంటూ బీజేపీ ఫైర్
అనుకున్న షెడ్యూల్ కంటే అరగంట ముందే ప్రధాని తెలంగాణలో ఎంటర్ అయినప్పుడు అర్థం అయింది రాజకీయ దుమారం ఖాయమని. బీజేపీ నేతలతో 10 నిమిషాల ఇంటరాక్షన్ కాస్త.. అరగంటకు పైగా సాగింది. బహిరంగ సభను తలపించింది. రానున్న ఎన్నికలే లక్ష్యంగా ప్రధాని మోడీ గురువారం చేసిన కామెంట్స్ తెలంగాణ అంతటా హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా మూఢ నమ్మకాల వ్యాఖ్యలు కేసీఆర్ కు డైరెక్ట్ గానే తగిలాయని అంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేసీఆర్ చేసిన పనులు అలాంటివే మరి.
జాతకాలు, ముహూర్తాలు, వాస్తుపై ఎవరి నమ్మకం వారిది. అయితే.. ప్రజల చేత ఎన్నుకోబడిన నేత వాటి వ్యామోహంలో ప్రజా ధనం వృధా చేస్తే మాత్రం విమర్శల పాలవ్వక తప్పదు. ప్రస్తుతం కేసీఆర్ అదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఆయన కంటికి వాస్తుకు అనుకూలంగా ఏది లేకపోతే క్షణాల్లో మారిపోవాల్సిందే. కోట్లు ఖర్చయినా సరే మార్పులు జరిగితీరాల్సిందే. అందుకే పాత క్యాంపు ఆఫీస్ వాస్తు ప్రకారం లేదని వందల కోట్ల రూపాయల ఖర్చుతో కొత్తది నిర్మించుకున్నారు. వాస్తు దోషం ఉందని సెక్రటేరియట్ ను సైతం మార్చాలని చూశారు. అది కుదరకపోవడంతో కూల్చివేసి వాస్తు ప్రకారం కొత్తది నిర్మిస్తున్నారు.
ఇక పార్టీ రాష్ట్ర కార్యాలయం విషయంలోనూ అంతే. పక్కనే కట్టిన పోలీస్ బిల్డింగ్ కారణంగా.. వాస్తు దోషాలు చెప్పడంతో.. జిల్లా పార్టీ కార్యాలయానికి భూమి కేటాయించుకున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇంతవరకు ఏ పార్టీకి జిల్లా కార్యాలయం కోసం భూమి కేటాయించింది లేదు. కానీ.. వాస్తు భయంతో కేసీఆర్ అత్యంత ఖరీదైన భూమిని ఇప్పించుకున్నారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఇలా అనేక విషయాల్లో అనేక నమ్మకాలతో కేసీఆర్ చర్యలను తప్పుబడుతూ వస్తున్నాయి విపక్ష పార్టీలు. అయితే.. తాజాగా మూఢ నమ్మకాలపై ప్రధాని విమర్శలు చేయడంతో ఈ విషయాలన్నింటిపై మరోసారి చర్చ మొదలైంది.
తనకు టెక్నాలజీపైన అపారమైన నమ్మకం ఉందని.. అంధవిశ్వాసులతో తెలంగాణకు ప్రయోజనం లేదని స్పష్టం చేశారు. కుటుంబ పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి కలగాలని.. 2024లో విముక్తి కలుగుతుందనే నమ్మకం తనకుందని ప్రకటించారు. కానీ.. అసెంబ్లీ ఎన్నికలు 2023లోనే జరగాల్సి ఉందని… తాము పారిపోయే వాళ్లం కాదు, పోరాడే వాళ్లమని చెప్పారు. బీజేపీ కార్యకర్తలు తగ్గే వాళ్లు కాదు.. నెగ్గే వాళ్లని ప్రకటించారు. తెలంగాణలో కుటుంబ పాలన అంతా అవినీతిమయం అయిందని ఆరోపించారు ప్రధాని. ఈ నేపథ్యంలో హిందుత్వం ముసుగులో కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారని విమర్శిస్తున్నారు బీజేపీ నేతలు. తానే గొప్ప హిందువునని డబ్బాలు కొట్టుకోవడమే గానీ.. భైంసా లాంటి ప్రాంతాల్లో ఇళ్లను తగులబెడుతున్నా చూస్తూ ఉండిపోయారని విమర్శిస్తున్నారు. పైగా హిందువులపైనే అక్రమ కేసులు పెట్టారని గుర్తు చేస్తున్నారు. యాగాలు, పూజల పేరుతో నాటకాలు ఆడుతూ ఎంఐఎం పార్టీతో అంటకాగుతూ.. ఆ పార్టీ నేతలు ఆడించినట్లు ఆడుతున్నారని ఆరోపిస్తున్నారు. మరోవైపు యువరాజు కేటీఆర్ కు పట్టాభిషేకం కోసం కూడా కేసీఆర్ అనేక పూజలు చేశారని విమర్శిస్తున్నారు బీజేపీ నేతలు.