ప్రపంచ వ్యాప్తంగా అద్భుత విజయాన్ని అందుకుంది ‘ఆర్ఆర్ఆర్’ మూవీ. ఆస్కార్ అవార్డును గెలుచుకుని సత్తా చాటింది. తెలుగు సినిమా గొప్పతనాన్ని అంతర్జాతీయ వేదికపై రెపరెపలాడించింది. ‘ఆస్కార్’ అవార్డు సాధించిన అనంతరం ‘ఆర్‌ఆర్‌ఆర్’ మూవీ టీమ్ హైదరాబాద్ కు చేరుకుంది. శుక్రవారం తెల్లవారుజామున శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న డైరెక్టర్ రాజమౌళి, ఆయన సతీమణి రమ, సంగీత దర్శకుడు కీరవాణి, ఆయన సతీమణి వల్లి, కార్తికేయ, కాలభైరవ, శ్రీసింహాకు అభిమానులు ఘన స్వాగతం పలికారు.
రాజమౌళి, కీరవాణితో ఫొటోలు దిగేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు. వారితో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపారు. దీంతో ఎయిర్‌పోర్ట్ ప్రాంగణం రద్దీగా మారింది. కట్టు దిట్టమైన భద్రత నడుమ కీరవాణి, రాజమౌళి ఎయిర్‌పోర్ట్ నుంచి బయటకు వచ్చారు.
ఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘నాటు నాటు’ సాంగ్ ఆస్కార్ రావడం సంతోషంగా ఉందని రాజమౌళి, కీరవాణి తెలిపారు. మరోవైపు ‘ఆర్‌ఆర్‌ఆర్’ టీమ్‌తో మాట్లాడేందుకు కొందరు మీడియా ప్రతినిధులు ప్రయత్నించగా.. ‘జైహింద్’ అంటూ రాజమౌళి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ప్రస్తుతం దీనికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా మార్చి 12న అమెరికాలో జరిగిన 95వ అకాడమీ అవార్డ్స్ వేడుకలో గోల్డ్ ఆస్కార్ ను అందుకుంది ఆర్ఆర్ఆర్ మూవీ టీమ్.
ఆస్కార్ వేడుకలో ‘RRR’ సినిమాకు ఆస్కార్ రావడం పట్ల దేశ వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తాయి. భారత ప్రధాని మోడీ, ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలువురు సీని, రాజకీయ ప్రముఖులు చిత్ర బృందంపై అభినందనలు కురిపించారు. సినీ దిగ్గజాల నడుమ ‘నాటు నాటు’ పాటకు కీరవాణి, చంద్రబోస్ అకాడమీ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ కు అమెరికాలో పార్టీ ఇచ్చారు దర్శకుడు రాజమౌళి.