రాజస్థాన్ ఉదయ్ పూర్ తరహా ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. అమరావతిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన తాజాగా సంచలనం రేపుతోంది.
బహిష్కృత బీజేపీ నేత నుపుర్ శర్మకు మద్దతుగా వాట్సాప్ లో పోస్టును ఓ మెడికల్ షాపు యజమాని ఫార్వర్ద్ చేశాడు. దీంతో అతన్ని దుండగులు దారుణంగా హత్య చేశారు.
గత నెల 21న ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో కేసులో ఆధారాలు, కీలక నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ కేసును దర్యాప్తు బాధ్యతను ఎన్ఐఏకు కేంద్రం అప్పగించింది.
ఉదయ్‌పుర్‌లో టైలర్ కన్హయ్య లాల్ ను ఇద్దరు మతోన్మాదులు క్రూరంగా హత్య చేశారు. ఆ హత్యకు వారం రోజుల ముందే డ్రగ్గిస్ట్ ప్రహ్లాద్ రావు హత్య జరిగింది. ఈ కేసులో కీలక నిందితుడు ఇర్ఫాన్ ఖాన్ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు అమరావతి పోలీస్ కమిషనర్ ఆర్తి సింగ్ వెల్లడించారు.
నిందితుడు ఇర్ఫాన్ ఖాన్ ఓ స్వచ్చంద సంస్థను నడుపుతున్నాడని పోలీసులు తెలిపారు. నుపుర్ శర్మకు మద్దతుగా ఉన్న ఓ పోస్టును పొరపాటున డ్రగ్గిస్ట్ ప్రహ్లాద్ రావు ఓ వాట్సాప్ గ్రూపులో ఫార్వర్డ్ చేశారని పోలీసులు పేర్కొన్నారు.
అదే గ్రూపులో కొందరు ముస్లింలు కూడా ఉన్నారని, ఈ ఘటన తర్వాత ప్రహ్లాద్ రావును హత్య చేసేందుకు ఇర్ఫాన్ కుట్ర పన్నాడని పోలీసు చెప్పారు. దీని కోసం ఐదుగురు వ్యక్తులను ఇర్ఫాన్ నియమించాడని, వారికి పదివేలు ఇస్తానని అతను చెప్పాడని పోలీసులు వెల్లడించారు. హత్య అనంతరం కారులో పారిపోయేందుకు కూడా ఏర్పాట్లు చేసినట్లు పోలీసులు వివరించారు.
జూన్ 21 ప్రహ్లాద్ రావు తన మెడికల్ షాపును మూసివేసి ద్విచక్ర వాహనం ఇంటికి వెళుతుండగా దుండగులు అతనిపై దాడి చేసి హత్య చేశారని పోలీసులు తెలిపారు. ఆ సమయంలో ప్రహ్లాద్‌రావు భార్య, కుమారుడు మరో ద్విచక్ర వాహనంపై ప్రహ్లాద్ రావు వెనకే వెళుతున్నారని పోలీసులు తెలిపారు.
అదే సమయంలో దుండగులు రెండు మోటార్ సైకిళ్లపై రాగా వారిలో ఒకరు ప్రహ్లాద్ రావుపై కత్తితో దాడి చేశాడు. ఆ తర్వాత దుండగులు అక్కడి నుంచి పరరయ్యారు. అనంతరం బాధితుడిని అతని కుమారుడు ఆస్పత్రికి తరలించాడు. అప్పటికే ప్రహ్లాద్ రావు మరణించాడని వైద్యులు నిర్ధారించారు.
కుటుంబ సభ్యుల ఫిర్యాదు కేసు నమోదు చేసి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారంతా దినసరి కూలీలుగా జీవనం సాగిస్తున్నట్టు పోలీసులు చెప్పారు. అసలు నిందితుడు పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నామని వివరించారు. అసలు నిందితుడు దొరకనందున హత్యకు గల కారణాలు తెలియలేదని పోలీసు కమిషనర్ చెప్పారు.