ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకి మరోసారి కరోనా సోకింది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లో ఐసోలేషన్ లో ఉన్నారు. ఆదివారం ఆయనకు నిర్వహించిన కొవిడ్ పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధరణ అయినట్లు ఉపరాష్ట్రపతి కార్యాలయం తెలిపింది.
“ఈరోజు నిర్వహించిన కరోనా పరీక్షల్లో గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. వైద్యుల సూచన మేరకు వారం రోజుల పాటు వారు స్వీయ నిర్బంధంలో ఉండనున్నారు” అని ఉపరాష్ట్రపతి కార్యాలయం ట్వీట్ చేసింది.
వెంకయ్యకు కరోనా సోకడంతో బుధవారం జరగనున్న గణతంత్ర వేడుకల్లో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొనే అవకాశం లేదని సమాచారం. వైద్యుల సూచనల మేరకు వారం రోజుల పాటు స్వీయ నిర్బంధంలోకి వెళ్లినట్లు వైస్ ప్రెసిడెంట్ ఆఫీస్ ఆ ప్రకటనలో పేర్కొంది.
కాగా.. 2020 సెప్టెంబర్ లో కూడా ఆయన కరోనా బారినపడ్డారు. ఇటీవల వరుసగా ప్రముఖులు కరోనా బారినపడుతున్నారు. ఇటీవల కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి కూడా ఈ వైరస్ సోకింది. ఈ విషయాన్ని స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. తనకు కరోనా స్వల్ప లక్షణాలు ఉన్నట్లు ఆయన తెలిపారు. హోం క్వారంటైన్‌లో చికిత్స తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన ట్వీట్‌లో సూచించారు.