ప్రముఖ సంస్థల్లో గత కొన్ని రోజులుగా ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ట్విట్టర్, మైక్రో సాఫ్ట్, మెటా, అమెజాన్ , ఫేస్ బుక్ వంటి దిగ్గజ సంస్థలు తమ ఉద్యోగుల్ని ఇంటికి పంపించేశాయి. ఇప్పటికే పలువురు ఉద్యోగులను ఇంటికి పంపించిన అమెజాన్ సంస్థ.. తాజాగా మరో సారి ఉద్యోగాల కోతకు సిద్దమవుతోంది.
ఆర్థిక మాంద్యం భయాలతో ఈ ఏడాది ఆరంభం నుంచి సుమారు 18 వేల మందికి పైగా ఉద్యోగుల్ని తొలగించిన అమెజాన్.. మరో 9 వేల మందికి ఉద్వాసన పలకనుంది. ఈ మేరకు కంపెనీ సీఈవో యాండీ జెస్సీ ఒక ప్రకటనలో వెల్లడించారు. రాబోయే రోజుల్లో మరింత అస్థిరత నెలకొనే అవకాశాలు ఉండడంతో కంపెనీ పై ఆర్థిక భారం తగ్గించుకోవాలని భావిస్తున్నాం అని అన్నారు. అందులో భాగంగా మరికొంత మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించామన్నారు.
వచ్చే నెలలో ఈ తొలగింపుల ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. త్వరలోనే దీనిపై ఉద్యోగులకు సమాచారం అందిస్తామని జెస్సీ చెప్పారు. అమెజాన్ రెండో విడత వార్షిక ప్రణాళిక ప్రక్రియ సమావేశం అనంతరం ఆయన ఈ ప్రకటన చేశారు. తాజా లేఆఫ్స్ తో ఈ సంవత్సరం ఇప్పటి వరకు అమెజాన్ 27,000 మంది ఉద్యోగుల్ని ఇంటికి పంపించినట్టయింది.ఒక పక్క ఉన్న ఉద్యోగులను తొలగిస్తున్నప్పటికీ… మరో పక్క కొత్త నియామకాలు ఆగవని ఈ సందర్భంగా జెస్సీ చెప్పారు.
అయితే ఈ నియామకాలు వ్యూహాత్మకంగా కీలకమైన విభాగాల్లో మాత్రమే ఉంటాయని స్పష్టం చేశారు. అమెజాన్ తాజా నిర్ణయంతో క్లౌడ్ కంప్యూటింగ్, మానవ వనరుల విభాగం, ప్రకటనలు, ట్విచ్ లైవ్ స్ట్రీమింగ్ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులపై తీవ్ర ప్రభావం చూపనుంది. గతంలో తొలగించిన 18,000 మందిలో రిటైల్, డివైజెస్, నియామకాలు, మానవ వనరుల విభాగాలకు చెందిన వారు ఉన్నారు.