ఓవైపు ఆర్టీసీ సమ్మెతో… భయంభయంగానే మెట్రోలో ప్రయాణిస్తున్న వారికి మరోసారి వెన్నులో వణుకు పుట్టించే ఘటన ఇది. అమీర్ పేట మెట్రో స్టేషన్ వద్ద మౌనిక మృతి తర్వాత మెట్రో సెఫ్టీపై అనేక సందేహాలు వస్తున్నాయి. తాజాగా ఇప్పుడు ఏకంగా మెట్రో క్యాబిన్ డోరే ఊడిపోవటంతో మరోసారి వార్తల్లో నిలిచింది మెట్రో.
ఎల్బీనగర్-మియాపూర్ మెట్రో మార్గంలో ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ వద్దకు చేరుకున్న సమయంలో డోర్ పై భాగంలో ఉన్న క్యాబిన్ ఊడి ప్రయాణికులపై పడింది. దీంతో ఒక్కసారిగా ప్రయాణికులు షాక్ తిన్నారు. పబ్లిక్–ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టు అని మెట్రో అధికారులు ప్రభుత్వ వర్గాలు గొప్పగా చెప్పుకుంటారు. కానీ ఇంత గొప్పగా ఉంటుందని అనుకోలేదని ప్రయాణికులు మండిపడుతున్నారు.
అయితే, నగరంలో ఆర్టీసీ సమ్మె, మరోవైపు క్యాబ్ డ్రైవర్లు కూడా సమ్మెలోకి వెళ్తుండటంతో… మెట్రో మరిన్ని సర్వీసులు నడుపుతామని చెప్తున్నా, ఇలా సెఫ్టీలేని ప్రయాణం అయితే ఎలా అని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. కాసుల కోసం కక్కుర్తి పడి… హడావిడిగా మెట్రో ప్రయాణాన్ని ప్రారంభించటం వల్లే ఇలాంటి సమస్యలు వస్తున్నాయని ఆరోపిస్తున్నారు. ఇటీవలే మౌనిక మృతి ఘటనలో మెట్రో సెఫ్టీ అథారిటీ కూడా రంగంలోకి దిగింది.