కామారెడ్డి మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా 3 వ రోజు రైతుల ఆందోళన కొనసాగుతోంది. నిన్న రైతులపై దాడికి నిరసనగా నేడు కలెక్టరేట్ దగ్గర రైతులు ఆందోళన చేపట్టారు. మరోవైపు అడ్లూర్ ఎల్లారెడ్డిలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పర్యటనపై ఉత్కంఠ కొనసాగుతోంది.
నిన్న బండి సంజయ్ పర్యటన ఉద్రిక్తతతో రేవంత్ రెడ్డి పర్యటన డైలమాలో ఉంది. మరో వైపు జిల్లా కలెక్టర్ తీరుపై రైతులు ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పటి వరకు రైతులను కలెక్టర్ కలవలేదు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ కారణంగా తనకు నష్టం జరుగుతుందన్న ఆందోళనతో సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డికి చెందిన రైతు రాములు ఇటీవల ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. రాములు కుటుంబాన్ని బండి సంజయ్ నిన్న పరామర్శించారు. మాస్టర్ ప్లాన్ కు వ్యతరేకంగా రైతులు చేపట్టిన ఆందోళనకు మద్దతు తెలిపారు. తరువాత రైతులు బీజేపీ నాయకులు,కార్యకర్తలతో కలిసి జిల్లా కలెక్టరేట్ ను బండి సంజయ్ ముట్టడించారు.
ఈ సందర్భంగా అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రైతులు,బీజేపీ కార్యకర్తలు…పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. తోపులాటలో కొంత మంది బీజేపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. కొందరు సొమ్మసిల్లి కింద పడిపోయారు. చివరకు పోలీసులు బండి సంజయ్ ని అదుపులో తీసుకొని హైదరాబాద్ కు తరలించారు.
మరో వైపు మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా, కలెక్టర్ తీరుకు నిరసనగా రైతు జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన కామారెడ్డి బంద్ సక్సెస్ అయింది. పట్టణంలోని దుకాణాలు,సినిమా హాల్స్, హోటళ్లు, ప్రైవేట్ విద్యాసంస్థలను మూసేవారు. బంద్ సందర్భంగా రైతులు,బీజేపీ,కాంగ్రెస్ కు చెందిన 170 మంది నేతలను అరెస్ట్ చేశారు.