ఈమధ్య రాహుల్ రామకృష్ణ, సోషల్ మీడియాలో చేసిన హంగామా అందరికీ తెలిసిందే. ఇకపై సినిమాలు చేయడం లేదు… నటనకు గుడ్ బై చెబుతున్నానంటూ పోస్ట్ పెట్టి సినీ అభిమానులను విపరీతమైన ఆశ్చర్యానికి గురిచేశాడు. తనదైన టైమింగ్ తో, తెలంగాణ యాసలో కామెడీ డైలాగులు అదరగొట్టే రాహుల్ రామకృష్ణకు ఏమైంది? ఎందుకు సినిమాల నుంచి చిన్నవయసులోనే రిటైర్ అవుతున్నాడంటూ సోషల్ మీడియాలో చాలా చర్చ నడిచింది. ఆ వెంటనే రాత్రికిరాత్రి రాహుల్ రామకృష్ణ రివర్స్ అయ్యాడు.
తాను జోక్ చేశానని వివరణ ఇచ్చాడు. సినిమాల్లో భారీగా పారితోషికం, లగ్జరీ లైఫ్ అందుబాటులో ఉంటే ఎందుకు తప్పుకుంటానంటూ రివర్స్ లో ప్రశ్నించాడు. సోషల్ మీడియాలో చర్చ గురించి ఫ్రెండ్స్ ఫోన్ చేసి చెప్పారని, చాలా ఆశ్చర్యపోయానన్న రాహుల్.. తను జోక్ చేశానన్నాడు. దీంతో సోషల్ మీడియాలో అతడిపై ఓ రేంజ్ లో ట్రోల్ జరిగింది. సినిమాల్లో చేయాల్సిన కామెడీని ట్విట్టర్ లో చేస్తావా అంటూ అంతా మండిపడ్డారు.
ఆ ఎపిసోడ్ నుంచి నెటిజన్లు మెల్లమెల్లగా బయటకొస్తున్న వేళ.. రాహుల్ రామకృష్ణ మరోసారి కెలికాడు. ఈరోజు పొద్దున్నే ఓ ట్వీట్ పెట్టాడు ఈ నటుడు. చాలా బోర్ కొడుతోందని, ఏమైనా మాట్లాడుకుందాం, ఛాట్ చేద్దాం, ప్రశ్నలు అడగండి అనే అర్థం వచ్చేలా పోస్ట్ పెట్టాడు.
ఇప్పటికే రాహుల్ రామకృష్ణపై పీకలదాకా కోపంతో ఉన్న నెటిజన్లు, ఈసారి అతడి పోస్ట్ చూసి మరింత రెచ్చిపోయారు. మరోసారి క్లాస్ తీసుకున్నారు. మీమర్స్ అయితే, కొత్త కొత్త మీమ్స్ తో తమ టాలెంట్ మొత్తం చూపించారు. అలా ఈరోజు రాహుల్ మరోసారి నెటిజన్ల ఆగ్రహానికి బలయ్యాడు.