బీహార్ సీఎం. జేడీ-యూ నేత నితీష్ కుమార్ కి వయసుడిగి తానేం మాట్లాడుతున్నారో తనకే తెలియడంలేదని ఎన్నికల ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ విమర్శించారు. రాజకీయంగా ఏకాకిగా మారిన ఆయన.. చూడబోతే కాస్త మానసిక దౌర్బల్యంతో బాధపడుతున్నట్టు కనిపిస్తోందన్నారు. తాను బీజేపీకి పని చేస్తున్నానని , ఒకప్పుడు జేడీ -యూ ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయవలసిందిగా సూచించానని నితీష్ కుమార్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను పీకే తప్పు పట్టారు. ఈ కామెంట్స్ ని బట్టి చూస్తే.. క్రమంగా ఆయన మానసిక స్థితి గతి తప్పుతున్నట్టు కనిపిస్తోందన్నారు.
వయసు మీద పడుతున్న ప్రభావం అర్థమవుతోందన్నారు. నితీష్ ఏదో ఒకటి చెప్పాలనుకుంటారని, కానీ చివరకు అర్థరహితంగా మరేదో మాట్లాడతారని ఆయన అన్నారు. బీజేపీ తరఫున నేను పని చేస్తున్నానని ఒకసారి అన్నారు. మళ్ళీ జేడీ-యూ ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలని నేను సూచించానంటున్నారు అసలు ఒకేసారి ఇవి జరిగే పనేనా అని ప్రశాంత్ కిషోర్ ప్రశ్నించారు. నేనిలా ఎందుకు సూచిస్తానని వ్యాఖ్యానించారు. ఇదంతా ఆయన వయస్సు ప్రభావమే అన్నారు.
తాను నమ్మని వారు తన చుట్టూ చేరినప్పుడు రాజకీయంగా ఏకాకినైనట్టు నితీష్ కుమార్ ఫీలవుతున్నారు. ఇది ఆయనలో నిరాశావాదాన్ని కలుగజేస్తోంది. వయస్సు పెరుగుతున్న దృష్ట్యా అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారు అని పీకే పేర్కొన్నారు.
ఒకప్పుడు జేడీ-యూ అధ్యక్షునిగా నితీష్ ఉండగా పీకే ఈ పార్టీ జాతీయ ఉపాధ్యక్షునిగా వ్యవహరించారు. ఇద్దరి మధ్యా సఖ్యత ఉండేది. అయితే విభేదాల నేపథ్యంలో ఒకరికొకరు దూరమయ్యారు. నితీష్ పై పీకే తాజాగా చేసిన విమర్శలపై స్పందించిన జేడీ-యూ జాతీయ అధ్యక్షుడు రాజీవ్ రంజన్ సింగ్.. నితీష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు నిజమేనన్నారు. ప్రస్తుతం బీహార్ లో ప్రశాంత్ కిషోర్.. బీజేపీ తరఫున పని చేస్తున్నారని చెప్పారు. వివిధ రాష్ట్రాల్లో వివిధ పార్టీల కోసం పీకే పని చేస్తూనే ఉంటారని ఆయన పేర్కొన్నారు. ఇది సహజమే అన్నట్టు సింగ్ వ్యాఖ్యానించారు.