పోలీజ్ జాబ్స్ అభ్యర్థుల దెబ్బకు తెలంగాణ ప్రభుత్వం దిగొచ్చింది. రెండేళ్ల వయో పరమితి విషయంలో వెనక్కి తగ్గింది కేసీఆర్ సర్కార్. 2020లో వేయాల్సిన నోటిఫికేషన్ ను ప్రభుత్వం రెండేళ్లు ఆలస్యంగా వేయడంతో దరఖాస్తు చేసుకోలేక తాము తీవ్రంగా నష్టపోతున్నామని నిరుద్యోగులు అనేక ఆందోళనలు చేశారు. పలుమార్లు డీజీపీ ఆఫీస్ ను ముట్టడించారు.
గతంలో డీజీపీ, మంత్రులను కలిసి సమస్య గురించి నిరుద్యోగులు చెప్పినా చివరి వరకూ నాన్చుతూ వచ్చింది ప్రభుత్వం. ఫైర్, జైళ్ల శాఖలోని కానిస్టేబుల్స్ పోస్టులకు గతంలో 35 ఏళ్ల వయోపరిమితి ఉంటే ఇప్పుడు 30 ఏళ్లకు కుదించారు. శుక్రవారం కానిస్టేబుల్ పోస్టులకు అప్లికేషన్ గడువు ఆఖరి రోజు. ఈ నేపథ్యంలో నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత అధికం కావడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గి.. పోలీసు శాఖ ఉద్యోగ నియామకాల్లో అభ్యర్థుల వయోపరిమితిని మరో రెండు సంవత్సరాలు పొడిగించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.
తెలంగాణలో 95 శాతం స్థానికత మొదటిసారిగా అమలులోకి రావడంతో పాటు, రెండేళ్లు కరోనా కారణంగా వయోపరిమితిని పెంచాలని.. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి చేసిన విన్నపానికి కేసీఆర్ సానుకూలంగా స్పందించినట్లు సీఎంఓ ప్రకటించింది. ఇందుకు సంబంధించి తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, డీజీపీని ఆదేశించారని వివరించింది.
ఉద్యోగ ప్రకటన వచ్చినప్పటి నుంచి వయో పరిమితి విషయంలో నిరుద్యోగులు ఆందోళన బాట పట్టారు. ప్రతిపక్ష పార్టీలు కూడా ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తూ.. లేఖలు, ధర్నాలు నిర్వహించాయి.