ఎన్ని రాజధానులు ఉన్నాయి? ఎంతమంది మహారాజులు వున్నారూ అన్నది కాదు ప్రజలు చూసి ఆనందపడేది, ఎవరు దయ చూపిస్తే నాలుగు కాలాల పాటు బ్రతుకుతామన్నదే వాళ్ళకి ముఖ్యం…
విశాఖపట్నం : అమరావతి రాజధానిగా ఉండాలా.. లేదా.. అని మంత్రి బొత్స సత్యనారాయణ ఒకటే పంచాయితీలు పెడుతున్న సమయంలో అక్కడ విశాఖ ఏజెన్సీ మారుమూల తండాల్లో మరణమృదంగం వినిపించింది. సరిగ్గా ఓ వారం క్రితం 28 ఏళ్ల లక్ష్మి ఏజెన్సీలో సరైన వైద్య సాయం అందక చనిపోయింది. విశాఖ జిల్లా మాడుగుల మండలంలోని మారుమూల వున్న జమదంగి గ్రామంలో నివసించే లక్ష్మికి నెలలు నిండాయి. మాములుగా అయితే వారికి బస్సు ఎక్కి డాక్టర్ దగ్గరకి వెళ్లాలి. కానీ నెలలు నిండిన పరిస్థితుల్లో ఆ అవకాశమే లేదు. 20 కిలోమీటర్ల అవతల వున్న బోయాతి గ్రామంలో ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర చూపించుకోవడానికి వేరే మార్గం లేక 20 కిలోమీటర్లు కాలినడకన వెళ్లాల్సి వచ్చింది. తిరిగి వస్తున్నప్పుడు తనకు తీవ్ర రక్తస్రావం జరిగి.. లక్ష్మి, ఆమెతో పాటు పుట్టకుండానే ఆమె బిడ్డ చనిపోయారు.
వారం తర్వాత మళ్లీ ఇప్పుడు.. అలాంటిదే మరో దురదృష్ట ఘటన. అరకులోయలోని దుంబ్రిగూడ మండలం లైగన్ పంచాయతీ పనసపొట్టు గ్రామంలో ఎల్లా తామరల అప్పలమ్మ స్థానిక ఏరియా ఆసుపత్రికి వచ్చింది. పురిటి నొప్పులతో బాధపడుతున్న ఆమెకు సకాలంలో ఆసుపత్రి సిబ్బంది అంబులెన్సు ఏర్పాటు చెయ్యలేక పోయారు. ఆఖరికి ఈ తెల్లవారుజామున అంబులెన్స్ ఏర్పాటు చేసి మెరుగైన వైద్యం కోసం విశాఖ వెళ్లడానికి ఏర్పాటుచేశారు. సకాలంలో అంబులెన్స్ రాకపోవడంతో 22 ఏళ్ల అప్పలమ్మ మార్గమధ్యంలోనే ఆడపిల్లకు జన్మనిచ్చి మృతి చెందింది. మృతురాలి బంధువులు, గిరిజన సంఘం నాయకులు డాక్టర్ నిర్లక్ష్యం వల్లే ఆమె చనిపోయిందని అరకు ఏరియా ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. అంబులెన్సు టైముకి రాకపోవడానికి రోడ్ లేకపోవడమే కారణమని ఆసుపత్రి వర్గాలు సాకులు చెప్తున్నాయి.
లక్ష్మి, అప్పలమ్మలే కాదు ఇక్కడ సరైన సదుపాయాలు లేక ఎందరో చనిపోతున్నారు. ఇప్పటికీ పురిటినొప్పులు వస్తే డోలు కట్టుకొని తీసుకొని వెళ్లే ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయినప్పుడల్లా ప్రపంచమంతా తెగ ఆశ్చర్య పోతుంటుంది. గత డిసెంబర్ నుంచి ఇప్పటివరకు ఐటీడీఏ లెక్కల ప్రకారం 130 మంది మహిళలు విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో మరణించారు. నాలుగు రాజధానుల కోసం కాదు.. మమ్మల్ని నాలుగేళ్లు బ్రతికేందుకు సాయపడే మారాజుల కావాలని ఏజెన్సీ జనం అడుగుతున్నారు. అలాంటి మారాజుల కోసం ఇక్కడి అమ్మలు ఎదురు చూస్తున్నారు.