దేశ రాజధానిలో అక్రమంగా నివసిస్తున్న నైజీరియన్లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంలో పోలీసులను నైజీరియన్లు ప్రతిఘటించారు. అరెస్టు చేసేందుకు వచ్చిన పోలీసులను వారు చుట్టు ముట్టారు. అప్పటికే కొంత మందిని పట్టుకోగా వారిని పోలీసుల నుంచి తప్పించేందుకు ప్రయత్నించారు.
నెబ్ సరాయ్ ప్రాంతంలో ఆఫ్రికా పౌరులు అక్రమంగా నివాసం ఉంటున్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో మాదక ద్రవ్యాల వ్యతిరేక విభాగం పోలీసులు అక్కడకు చేరుకున్నారు. అక్కడ గడువు ముగిసినప్పటికీ అక్రమంగా ఉంటున్న ముగ్గురు నైజీరియ్లను గుర్తించి అరెస్టు చేశారు.
దీంతో వంద మందికి పైగా ఆఫ్రికా జాతీయులు పోలీసులను చుట్టుముట్టారు. నైజీరియ్లను అరెస్టు చేయకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించారు. పోలీసులపై నైజీరియన్లు తిరగబడ్డారు. ఈ క్రమంలో అరెస్టైన వారిలో ఇద్దరు నైజీరియన్లు తప్పించుకున్నారు.
ఈ క్రమంలో నార్కోటిక్స్ పోలీసులు వెనుదిరిగారు. సాయంత్రం 6.30 గంటలకు మరోసారి నెబ్ సరాయ్ పోలీసులను వెంట తీసుకుని ఆ ప్రాంతానికి వెళ్లారు. ఒక మహిళతోపాటు మరో నలుగురు నైజీరియన్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ నేపథ్యంలో మరోసారి సుమారు 200 మంది ఆఫ్రికన్లు పోలీసు బృందాలను చుట్టుముట్టారు. పోలీసుల అదుపులో ఉన్న వారిని తప్పించేందుకు ప్రయత్నించారు. కానీ పోలీసులు వారిని సమర్థవంతంగా అడ్డుకున్నారు. అరెస్ట్ చేసిన నైజీరియన్లను పోలీస్ స్టేషన్‌కు తరలించారు.