‘అగ్నిపథ్’ పథకంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో రక్షణ శాఖ శనివారం అప్రమత్తమైంది. ఈ మేరకు ఉన్నత అధికారులతో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ… అగ్నిపథ్ విషయంలో మాజీ సైనికుల సంఘంతో పాటు పలువురు నిపుణులతో సుదీర్ఘంగా చర్చించామని తెలిపారు. వారందరిలో ఏకాభిప్రాయం వచ్చాకే ఈ పథకాన్ని తీసుకు వచ్చినట్టు ఆయన పేర్కొన్నారు.
కొందరు తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే అగ్నిపథ్ పై లేని పోని అపోహలు వ్యాప్తిచేస్తున్నారని మండిపడ్డారు. ఈ స్కీం ద్వారా సైనిక నియామక ప్రక్రియలో విప్లవాత్మక మార్పులను తీసుకురానున్నట్టు ఆయన వెల్లడించారు. ఈ పథకం కింద నియమితులయ్యే వారికి శిక్షణ విషయంలో రాజీపడబోమని వివరించారు.
సాధారణంగా కొత్త పథకంపై కొంత వరకు గందరగోళం ఉంటుందన్నారు. అగ్నిపథ్ పథకంపై జరుగుతున్న నిరసనలను ఆయన రాజకీయ ప్రేరేపితమన్నారు. తాము అధికారంలో ఉన్నా లేదా ప్రతి పక్షంలో ఉన్నా దేశ రక్షణే తమ ధ్యేయమన్నారు.
ఈ సమావేశానికి ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి, నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్, సైనిక విభాగాల అధిపతులు పాల్గొన్నారు. ఆర్మీ చీఫ్ మనీశ్ పాండే ప్రస్తుతం హైదరాబాద్ లో పర్యటనలో ఉన్నారు. దీంతో ఆయన సమావేశానికి హాజరు కాలేదు.
ఆర్మీ చీఫ్ బదులు వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ బీఎస్ రాజు సమావేశానికి హాజరయ్యారు. అగ్నిపథ్ పై పలు రాష్ట్రాల్లో ఆందోళనలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్టు సమాచారం.