సైన్యంలో నియామకాలకు సంబంధించి కేంద్రం తీసుకు వచ్చిన అగ్నిపథ్ పై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఆందోళనలు మిన్నంటాయి. ఈ నేపథ్యంలో కేంద్రం దిద్దుబాటు చర్యలకు దిగింది.
ఈ మేరకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అగ్నిపథ్ పథకంలో పలు మార్పులను కేంద్రం చేసింది. దీనికి సంబంధించి పలు విషయాలను రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వివరించారు.
అగ్నివీరులుగా నాలుగేండ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్ ఇవ్వనున్నట్టు కేంద్రమంత్రి శనివారం ప్రకటించారు.
అగ్నివీర్ పథకం కింద రిక్రూట్ అయిన వారికి రక్షణ మంత్రిత్వ శాఖ, ఇండియన్ కోస్ట్ గార్డ్, డిఫెన్స్ సివిల్ పోస్టులు, మొత్తం 16 డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్ సంస్థల్లో ఉద్యోగ ఖాళీలకు రిజర్వేషన్లు ఇవ్వనున్నట్టు చెప్పారు.
వీటితో పాటు మొదటి ఏడాదిలో రిక్రూట్‌మెంట్ కోసం వయోపరిమితిని కూడా పెంచినట్టు తెలిపారు. ఈ ఏడాది ప్రకటించనున్న అగ్నిపథ్ నోటిఫికేషన్ లో అభ్యర్థులకు వయోపరిమితిని 18 నుంచి 23 ఏండ్లకు పెంచినట్టు తెలిపారు.
ఇతర ఉద్యోగాల్లోనూ అగ్నివీరులకు వయోపరిమితిని పెంచనున్నట్టు ఆయన చెప్పారు. పారామిలటరీ దళాల్లో అగ్నివీరులకు గరిష్ఠ వయోపరిమితిని 26 ఏండ్లకు పెంచనున్నట్టు చెప్పారు. పారామిలటరీ బలగాలతో పాటు అసోం రైఫిల్స్ లోనూ అగ్ని వీరులకు 10శాతం రిజర్వేషన్ ఇవ్వనున్నట్టు వివరించారు.