సైనిక దళాల్లో నియామకాల కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ దేశంలో పలుచోట్ల ఆందోళనలు మిన్నంటాయి. ముఖ్యంగా బీహార్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వరుసగా రెండోరోజూ వీధుల్లోకి వచ్చిన యువకులు ఆందోళనలు నిర్వహించారు. ఈ పథకంతో కేంద్ర ప్రభుత్వం తమని మోసగించాలని చూస్తోందని యువత ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
బీహార్ లోని ముజఫర్‌పూర్, బుక్సార్ పట్టణాల్లో నాలుగేళ్ల తరువాత ఏం చేయాలని ఆందోళనల్లో పాల్గొన్న యువకులు ప్రశ్నించారు. మంగళవారం అగ్నిపథ్ రిక్రూట్మెంట్ స్కీమ్ కు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ శ్రీకారం చుట్టారు. ఈ నియామక ప్రక్రియలో భాగంగా తొలి బ్యాచ్ లో 17 ఏళ్ల నుంచి 21 ఏళ్లలోపు వయసులోని దాదాపు 45వేల మందిని నాలుగేళ్ల స్వల్ప కాలపరిమితి కోసం సైన్యంలో భర్తీ చేసుకోనున్నారు. వచ్చే 90 రోజుల్లోగా దీనికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభం కానుందని వెల్లడించారు.
2023 జూలై నాటికి తొలి బ్యాచ్ శిక్షణ పూర్తవుతుంది. ఫ్రొఫెషనల్ ఆర్మీని పెంచడానికి బదులుగా మోడీ సర్కారు పెన్షన్ డబ్బును ఆదా చేయడానికి కాంట్రాక్ట్ సైనికులను ప్రతిపాదిస్తున్నట్లు కొంతమంది యువకులు వ్యతిరేకిస్తున్నారు. నాలుగేళ్లు పనిచేసిన తర్వాత తాము ఏం చేయాలని.. ఉపాధి కోల్పోయి రోడ్లపై పడతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కేంద్రం తీసుకువచ్చిన అగ్నిపథ్ స్కీమ్ ను వ్యతిరేకిస్తూ యువకులు చేపట్టిన ఆందోళనలు అక్కడక్కడా హింసాత్మకంగా మారాయి. అర్రా రైల్వే స్టేషన్ వద్ద పోలీసులపైకి నిరసనకారులు రాళ్లు రువ్వారు. వారిని చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో ఆందోళనకారులు స్టేషన్ ఫర్నీచర్ కు నిప్పుపెట్టారు. ఛాప్రాలో రెండు రైళ్లకు నిప్పంటించారు. స్టేషన్ లో ఆగి ఉన్న ప్యాసింజర్ రైలును తగులబెట్టిన యువకులు.. మరో రైలుకు సైతం నిప్పంటించారు.