అగ్నిపథ్ పథకం అగ్గి రాజేస్తోంది. సైన్యంలో నియామకాలకు సంబంధించిన ఈ నూతన పథకం యువతలో ఎన్నో సందేహాలు… మరెన్నో భయాలకు బీజం వేసింది. ప్రధానంగా నాలుగేండ్ల సర్వీసు నిబంధనతో తమను ఇంటికి పంపితే తమ భవిష్యత్ అగమ్య గోచరంగా మారుతుందని యువత ఆందోళనలు వ్యక్తం చేస్తోంది. దీంతో యువత ఆందోళనల బాట పట్టింది.
ఆ ఆందోళనలకు ఆవేశం తోడవ్వడంతో ప్రస్తుతం అవి విధ్వంసం దిశగా ప్రయాణిస్తున్నాయి. ప్రభుత్వంపై పెల్లుబికిన ఆగ్రహాన్ని ప్రభుత్వ, ప్రజా ఆస్తులపై దాడులతో చల్లార్చుకుంటోంది. ఇది ఇలాగే కొనసాగితే మరింత పెను ముప్పుగా మారే అవకాశం ఉంది. అందువల్ల అందరూ సంయమనం పాటించాలని ప్రభుత్వాలు కోరుతున్నాయి.
మరోవైపు అగ్నిపథ్ తో సైన్యంలో యువతకు అవకాశాలు పెరుతాయే తప్పా వారి భవిష్యత్ కు ఎలాంటి ఢోకా ఉండదని కేంద్రం చెబుతోంది. వారి భవిష్యత్ అవకాశాల బాధ్యత తమదేనంటూ భరోసానిచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. భయాలను పక్కన పెట్టి అగ్ని పథ్ గురించి పూర్తిగా తెలుసుకుంటే అన్ని అపోహలు తొలగిపోతాయని కేంద్రం చెబుతోంది.
అగ్నిపథ్ పై అపోహలుః
అగ్నిపథ్ పై యువత ఆందోళన చెందుతోంది. ముఖ్యంగా నాలుగేండ్ల సర్వీసు అంటే చాలా తక్కువ సమయం అని ఆవేదన వ్యక్తం చేస్తోంది. అంత కష్టపడి సర్వీసుల్లోకి వచ్చిన తమను నాలుగేండ్లకు తొలగించడమేంటని, ఆ తర్వాత మా భవిష్యత్ ఏంటని కేంద్రంపై ప్రశ్నలు సంధిస్తోంది.
మరోవైపు ఈ కొత్త పథకంతో సైన్యంలో తమకు ఉద్యోగవకాశాలు తగ్గిపోతాయని ఆందోళన చెందుతోంది. మరోవైపు ఈ అగ్నిపథ్ తో రెజిమెంటల్ బాండింగ్ పై తీవ్ర ప్రభావం పడుతుందని పలువురు భయాందోళనలు చెందుతున్నారు. 21 ఏండ్లకు చాలా మందిలో అసలు మానసిక పరిపక్వత రాదని వాదనలు వినిపిస్తున్నారు. అలాంటప్పుడు వారి సేవలపై సైన్యం ఆధారపడటమనేది పూర్తిగా అవివేకమే అవుతుందంటున్నారు.
ఈ కొత్త స్కీమ్ తో సైన్యం సామర్థ్యం క్షీణిస్తుందని, భవిష్యత్ లో అగ్నివీరులు ప్రమాదకరంగ మారతారని సందేహాలను వెలిబుచ్చుతున్నారు. అసలు రక్షణ నిపుణులతో చర్చించకుండానే ప్రభుత్వం ఆఘమేఘాల మీద ఈ పథకాన్ని తీసుకు వచ్చిందని పలువురు మండిపడుతున్నారు.
అగ్నిపథ్ పై ఆందోళనలు వద్దు..
అగ్నిపథ్ పై దుష్ప్రచారం జరుగుతోందని, వాటిని నమ్మి యువత తమ బంగారు భవితను నాశనం చేసుకోవద్దని కేంద్రం సూచిస్తోంది. అగ్నిపథ్ తో సైన్యంలో మరిన్ని ఉద్యోగావకాశాలు పెరుగుతాయని కేంద్రం చెబుతోంది. ముఖ్యంగా త్రివిధ దళాల్లో యువతకు, సాంకేతికతకు ప్రాధాన్యత ఇచ్చి త్రివిధ దళాలను మరింత బలోపేతం చేసేందుకే ఈ పథకాన్ని తీసుకువచ్చినట్టు వెల్లడించింది.
ఈ పథకం కింద అగ్నివీరులు నాలుగేండ్ల పాటు సర్వీసు చేయాల్సి వుంటుందని, ఈ కాలంలో వారికి ౩౦ నుంచి 40 వేల వేతనం అందించనున్నట్టు చెబుతోంది. సర్వీసు అనంతరం అగ్నివీరులకు బ్యాంకు రుణంతో పాటు బీమాను కూడా అందించనున్నట్టు వివరిస్తోంది. నాలుగేండ్లలో మెరుగైన ప్రతిభ చూపిన వారి సర్వీసు కొనసాగుతుందని, మిగతా వారికి సీఏపీఎఫ్, రాష్ట్ర పోలీసు ఉద్యోగాల్లో అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు స్పష్టం చేస్తోంది.
ఈ పథకంతో సైనిక దళాల్లో అవకాశాలు పెరగడమే తప్పా తగ్గడం ఉండదని, సైన్యం శక్తి సామర్థ్యాలు మరింత పెరుగుతాయని అంటోంది. ఒక సారి భారతమాతకు సేవలందించిన సైనికులు జీవితాంతం దేశ సేవకోసమే పనిచేస్తారని కేంద్రం వాదిస్తోంది. అయితే ఎవరి వాదనలు ఎలా ఉన్నా దీనిపై పూర్తి స్థాయిలో యువతకు అవగాహన కల్పించాకే ముందుకు వెళ్లాలని అందరూ కోరుకుంటున్నారు.