రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న ఉద్దేశంతోనే కొత్త చట్టాలను తీసుకొచ్చామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ రాజ్యసభలో ప్రకటించారు. వ్యవసాయ చట్టాల్లో సవరణలకు సిద్ధమని తాము ప్రకటిస్తున్నామంటే.. అందులో సమస్య ఉన్నట్లు కాదని, చట్టాల్లో ఒక్క లోపాన్ని కూడా విపక్షాలు ఎత్తిచూపలేకపోయాయని ఎదురు దాడి చేశారు. రైతుల నిరసనలు ఒక్క రాష్ట్రానికే పరిమితమయ్యాయని, ఎందుకో ఆలోచించాలంటూ పరోక్షంగా పంజాబ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వేలెత్తి చూపారు.
రాజ్యసభలో కొత్త వ్యవసాయ చట్టాలపై మాట్లాడుతూ… రైతుల సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సాగు రంగంలో పెట్టుబడులు పెంచేందుకు ప్రయత్నిస్తున్నామని, సాగు చట్టాల సవరణకు సిద్ధంగా ఉన్నామన్నారు. భూములు ఆక్రమణకు గురవుతున్నాయని రైతులు భయపడ్డా.. అలాంటి నిబంధనలు లేవని మీకూ తెలుసు అంటూ కామెంట్ చేశారు.
రైళ్లలో పండ్లు, కూరగాయల రవాణాను ఎవరూ ఊహించలేదని, ఇప్పటికే 100 కిసాన్ రైళ్లను ఏర్పాటు చేశామన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.