తేజ సినిమాల్లో హీరో ఎలా ఉంటాడో అందరికీ తెలిసిందే. అమాయకమైన చూపులతో, లేత ఛాయలతో బిత్తరచూపులు చూస్తూ గుబులుగా కనిపిస్తాడు. ఏకంగా మహేష్ బాబు లాంటి హీరోనే అమాయకంగా చూపించిన ఘనత దర్శకుడు తేజాది. అలాంటిది కొత్త కుర్రాడు అభిరామ్ ను విడిచిపెడతాడా?
అహింస సినిమా టీజర్ రిలీజైంది. దగ్గుబాటి నటవారసుడు, సురేష్ బాబు కొడుకు, రానా తమ్ముడు, రామానాయుడు మనవడు.. ఎలా ఉంటాడో, ఎలా నటించాడో చూడాలనే ఆసక్తి అందరికీ ఉంది. ఈరోజు రిలీజైన టీజర్ తో ఆ ఉత్సుకతకు ఓ వివరణ దొరికినట్టయింది. తేజ మునుపటి హీరోల్లానే అహింస సినిమాలో దగ్గుబాటి అభిరామ్ లేతగా, అమాయకంగా కనిపించాడు. అతడి డైలాగ్ డెలివరీ అయితే టీనేజ్ పిల్లాడి కంటే మరీ తక్కువ స్థాయిలో ఉంది.
తన కథకు తగ్గట్టు హీరోల్ని మార్చేయడం తేజ స్టయిల్. నిజానికి అభిరామ్ నిజజీవితంలో రెబల్. దగ్గుబాటి కాంపౌండ్ తో పరిచయమున్న ఎవరికైనా ఈ విషయం తెలుస్తుంది. అలాంటి అభిరామ్ ను కూడా అహింస కోసం స్మూత్ గా మార్చేశాడు తేజ. మెడలో నల్లటి తాడు వేసుకొని, కళ్లు పెద్దవి చేసుకొని, అభిరామ్ అమాయకంగా డైలాగ్ చెబుతుంటే నవ్వొస్తుంది. కానీ ఆ కథకు అదే అవసరం కాబోలు. లేదంటే తేజ అలా ఊరికే ఎవ్వర్నీ వదిలేయడు కదా. అవసరమైతే చేయి చేసుకునే రకం ఈ డైరక్టర్.
హీరోహీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ తో మొదలైంది టీజర్. తేజ గత సినిమాల్లానే, ఇందులో కూడా హీరోయిన్, హీరో వెంట పడుతుంది. ముద్దులివ్వమంటుంది. ఆ తర్వాత టీజర్ లోకి యాక్షన్ ఎంటరైంది. అమాయకమైన హీరో, రెబల్ అవుతాడు. ఇలా పూర్తిగా తేజ మార్క్ తో నడిచింది అహింస టీజర్. హీరోహీరోయిన్ల లుక్స్, యాక్టింగ్ తో పాటు సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తారు.