ఆఫ్ఘనిస్తాన్‌లో స్థిరపడిన కశ్మీర్ వాసి ఎజాజ్ అహ్మద్ అహంగర్ అలియాస్ అబూ ఉస్మాన్ అల్-కశ్మీరీని కేంద్రం ఉగ్రవాదిగా ప్రకటించింది. ఈ మేరకు కేంద్రం ప్రకటన విడుదల చేసింది. అతనికి అల్ ఖైదాతో సంబంధాలు ఉన్నాయని కేంద్రం వెల్లడించింది.
ఈ నేపథ్యంలో అతన్ని ఉగ్రవాదిగా గుర్తిస్తున్నట్టు కేంద్రం తెలిపింది. భారత చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం, 1967 ప్రకారం అహంగర్‌ను ఉగ్రవాదిగా ప్రకటించినట్టు కేంద్రం పేర్కొంది. ఎజాజ్ అహ్మద్ అహంగర్ ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్‌లో ఉంటున్నాడు.
ఇస్లామిక్ స్టేట్ జమ్ముకశ్మీర్ (ఐఎస్‌జేకే) కోసం ఉగ్రవాదులను నియమిస్తున్న రిక్రూటర్లలో అతను ఒకడిగా ఉన్నాడు. గతంలో అతన్ని కశ్మీర్ పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత 1996లో కశ్మీర్ జైలు నుంచి విడుదలైనప్పటి నుంచి అతను కనిపించకుండా పోయాడు.
ఆన్‌లైన్ ఇండియా-సెంట్రిక్ ఐసీసీ ప్రచార పత్రికను స్థాపించడంలో అతను కీలకపాత్ర పోషించాడు. చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం కింద అతడిని నాలుగో షెడ్యూల్‌లో కేంద్రం చేర్చింది. దీంతో ఇలా ఉగ్రవాదిగా ప్రకటించబడిన 49వ వ్యక్తి అహంగీర్ అని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తన నోటిఫికేషన్‌లో పేర్కొన్నది.