అనిషా పాటిల్.. పదేళ్ల అమ్మాయి. మిమ్మల్ని ఒకసారి కలవాలని ఉంది అంటూ ఏకంగా ప్రధాని మోడీకే మెయిల్ చేసింది. రిప్లై ఏం వచ్చిందో తెలుసా, దౌడ్ కే ఆజా బేటా.. ఇంకేముంది ఇదిగో ఈ సీన్ అదే.
మహారాష్ట్ర అహ్మద్ నగర్ ఎంపీ సుజయ్ విఖే పాటిల్ కుమార్తె అనిషా పాటిల్ కు ప్రధానిని కలవాలనేది కల. తనను మోడీ దగ్గరకు తీసుకెళ్లాలని రోజూ సుజయ్ ని అడిగేదట. ఆయన చాలా బిజీగా ఉంటారని ఏదో ఓ సాకు చెబుతూ వస్తున్నారాయన. నాన్నతో పెట్టుకుంటే పనికాదని అనుకుందో ఏమోగానీ… ఆయనకు తెలియకుండా ప్రధానికి మెయిల్ పంపింది. అది చూసిన మోడీ పార్లమెంట్ లోని తన కార్యాలయానికి రమ్మని రిప్లై ఇచ్చారు.
ప్రధానిని కలిసేందుకు వెళ్లింది అనిషా కుటుంబం. ఆ సమయంలో ఆయన అనిషా ఎక్కడ అని అడిగారు. దీంతో చిన్నారి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. సంతోషంలో మునిగిపోయింది. మోడీ ఆఫీస్ లోకి ఎంటర్ అయినప్పటి నుంచి అనిషా మాట్లాడుతూనే ఉందట. ‘‘ఇది మీ ఆఫీసా.. ఎంత పెద్దదో… మీరు రోజంతా ఇక్కడే కూర్చుంటారా..? అంటూ ప్రశ్నలు వేస్తూనే ఉందట. అయితే ఆ చిన్నారికి ఓపిగ్గా సమాధానాలు చెప్పిన మోడీ… నిన్ను కలవడానికే ఇక్కడికి వచ్చానని సమాధానం ఇచ్చారు. ఆ సమయంలో మీరు ప్రెసిడెంట్ ఎప్పుడవుతారని అడిగిందట అనిషా. అది విని ఆయన పెద్దగా నవ్వారట. దాదాపు 10 నిమిషాలపాటు వీరి భేటీ జరిగింది. క్రీడలు, అధ్యయనాలు, ఇతర వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుకున్నారు.