తమిళనాడులో అన్నాడీఎంకే డేంజర్ జోన్ లో ఉందని ఈ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి, దివంగత సీఎం జయలలిత సన్నిహితురాలు వి.కె. శశికళ అన్నారు. ప్రస్తుతం ఇది సురక్షితంగా లేదని, ఒక పార్టీకి బలం కేడరేనని, దీన్ని ముఖ్యమైన అంశంగా పరిగణించాలని ఆమె చెప్పారు. కేవలం ఓ వంద మంది లేదా 200 మందితో పార్టీని నడపలేమన్నారు. ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె.. 2024 ఎన్నికలకు ముందు తాను రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తానని తెలిపారు.
ఏఐఏడీఎంకేకి తిరిగి పూర్వ వైభవం తేవలసి ఉందని, అంతా కలిసి 2024 ఎన్నికల్లో విజయం కోసం కృషి చేయవలసి ఉందని ఆమె పేర్కొన్నారు. జయలలిత 75 వ జయంతి సందర్భంగా తానీ మాటలు చెబుతున్నానని, ఆమె లేరని తాను భావించడం లేదని, ఇప్పటికీ తనతోనే ఉన్నట్టు ఫీలవుతున్నానని శశికళ తెలిపారు.
పార్టీలో ఓపీఎస్,ఈపీఎస్ మధ్య వివాదంపై సుప్రీంకోర్టు ఓ రూలింగ్ ఇచ్చిందని, దీనిపై మీ వైఖరేమిటన్న ప్రశ్నకు ఆమె.. సివిల్ కోర్టులో తాను వేసిన కేసుకు, దీనికి మధ్య సంబంధం లేదని అన్నారు.
పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఈపీఎస్ కొనసాగవచ్చునంటూ గత సెప్టెంబరులో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పు సక్రమమేనని సుప్రీంకోర్టు తాజాగా తీర్పునిచ్చింది. జయలలిత ఆశయాల సాధనకు తన కృషి నిరంతరం ఉంటుందని చెప్పిన శశికళ.. బీజేపీపై విరుచుకుపడ్డారు. ఆ పార్టీ తన నీడను సైతం తాకజాలదన్నారు. మా పార్టీ వ్యవహారాల్లో ఆ పార్టీ నేతలు జోక్యం చేసుకోజాలరని ఆమె చెప్పారు.