తమిళనాడులో బీజేపీ, అన్నాడీఎంకే మధ్య దూరం పెరుగుతున్నట్టు కనిపిస్తోంది. అన్నాడీఎంకే కార్యాలయంలో ఆ పార్టీ ఏర్పాటు చేసిన ఓ పోస్టరుపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఈ పోస్టరులో మిత్రపక్షం బీజేపీ గుర్తు, ప్రధాని మోడీతో పాటు ఇతర నేతల ఫోటోలు కూడా లేకపోవడం గమనార్హం.
ఈ నెల 27న ఈరోడ్ ఈస్ట్ నియోజకవర్గానికి ఉపఎన్నిక నిర్వహించనున్నారు. అన్నాడీఎంకే చీఫ్ పళనీస్వామి ఇక్కడ నుంచి బరిలోకి దిగుతున్నారు. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే కార్యాలయంలో బుధవారం ఓ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో ఏర్పాటు చేసిన ఓ పోస్టర్‌లో బీజేపీ గుర్తు, నేతల ఫోటోలను తొలగించారు.
దీంతో పాటు బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఏ) బదులుగా ‘నేషనల్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ అలయన్స్’అని ముద్రించారు. దీనిపై అన్నాడీఎంకే నేత ఒకరు మాట్లాడుతూ… రాష్ట్రంలో బీజేపీ స్థానం ఏంటో ఆ పార్టీ నేతలు తెలుసుకోవాలని ఆయన అన్నారు. అందుకే పార్టీ చీఫ్ పళనిసామి దీనిపై స్పష్టత నిచ్చారన్నారు.
అన్నాడీఎంకే పోస్టర్‌లో బీజేపీ నేతల పేర్లు లేకపోవడంపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై స్పందించారు. త్వరలోనే దీనికి సరైన సమాధానం చెబుతామని ఆయన అన్నారు. దీంతో ఓ గంట తర్వాత పోస్టర్‌లో ఎన్డీఏ పేరును అన్నాడీఎంకే నేతలు పునరుద్దరించారు.
మరోవైపు జయలలిత మరణాంతరం అన్నాడీఎంకే నేతలు పళనీస్వామి, పన్నీర్ సెల్వంలు బీజేపీతో దోస్తీ చేస్తారు. ఆ మేరకు బీజేపీతో కలిసి లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి పరాజయం పాలయ్యారు. పళనిసామి, పన్నీర్ సెల్వం మధ్య బీజేపీనే విభేదాలు సృష్టిస్తోందని అన్నాడీఎంకే నేతలు అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీని దూరం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది.