అనుకున్నదే అయింది. ఎట్టకేలకు మాణిక్కం ఠాగూర్‌ను సాగనంపారు సీనియర్లు. ఆయన్ని గోవా కాంగ్రెస్ కు ఇంఛార్జ్ గా నియమించింది ఏఐసీసీ. ఈమేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. మాణిక్కం ప్లేస్ లో టీపీసీసీకి కొత్త ఇంఛార్జ్ గా మాణిక్ రావు థాక్రేను నియమించింది అధిష్టానం.
ఠాగూర్ తీరుపై సీనియర్లలో అసంతృప్తి ఉంది. కొందరు నేతలు బహిరంగంగానే ఆయన్ను టార్గెట్ చేశారు. ఓ సమయంలో పీసీపీ చీఫ్ పదవిని ఠాగూర్ అమ్ముకున్నారంటూ సంచలన ఆరోపణలు వినిపించాయి. కనీసం నేతల మధ్య సమన్వయం కుదర్చలేకపోయారంటూ ఆరోపించారు. సీనియర్ల అలక నేపథ్యంలో పార్టీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది.
పరిస్థితిని చక్కదిద్దేందుకు ట్రబుల్ షూటర్ దిగ్విజయ్ సింగ్ ఈమధ్యే రాష్ట్రానికి వచ్చి వెళ్లారు. పార్టీ పరిస్థితులపై ఆయన ఓ నివేదికను తయారు చేశారు. ఆ నివేదిక నేపథ్యంలో ఠాగూర్‌ను తప్పిస్తున్నారంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇంఛార్జ్ పదవికి అధిష్టానం ఆయనతో రాజీనామా చేయిస్తోందని వార్తలు గుప్పుమన్నాయి.
ఇదే కమ్రంలో టీపీసీసీ వాట్సాప్ గ్రూపు నుంచి ఆయన ఈ రోజు వైదొలగడం వార్తలకు బలం చేకూర్చింది. వాట్సాప్ గ్రూపు నుంచి వైదొలిగిన విషయాన్ని ఒప్పుకున్న ఆయన దానికి కారణాలు మాత్రం వివరించలేదు. దీంతో ఆయన రాజీనామా వార్తలపై కొతం అస్పష్టత నెలకొంది.
కానీ గంటల వ్వవధిలోనే దానిపై ఓ క్లారిటీ ఇచ్చింది అధిష్టానం. ఆయన్ని గోవా ఇంఛార్జ్ గా నియమిస్తూ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కే.సీ. వేణుగోపాల్ ఓ ప్రకటన విడుదల చేశారు. కారణాలేవైనా గానీ మొత్తానికి సీనియర్లు మాత్రం అనుకున్నది సాధించారని అంతా చర్చించుకుంటున్నారు.