తెలంగాణ కాంగ్రెస్ నేతలతో కొత్త ఇన్ ఛార్జ్ మానిక్ రావు ఠాక్రే వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. తొలిసారిగా తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన ఆయనకి శంషాబాద్ ఎయిర్ పోర్టులో కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికారు. రెండు రోజుల పాటు రాష్ట్రంలో మానిక్ రావ్ పర్యటించనున్నారు. మొదటి రోజు నేతలతో తీరిక లేకుండా ఆయన వరుసగా సమావేశమయ్యారు. తొలుత రాష్ట్ర ఇన్ ఛార్జ్ ఏఐసీసీ కార్యదర్శులు బోసు రాజు, నదీమ్ జావిద్, రోహిత్ చౌదరీలతో గంటపాటు భేటీ అయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ స్థితిగతులు, నాయకుల తీరు తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. తర్వాత పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో విడివిడిగా సమావేశయ్యారు.
వీరిద్దరి నుంచి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ స్థితిగతుల గురించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు మానిక్ రావు. ఆ తర్వాత గీతారెడ్డి, మధుయాష్కీ, పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, జానారెడ్డి, చిన్నారెడ్డి, షబ్బీర్ అలీ, హనుమంతరావు, మహేశ్వర్ రెడ్డి సహా మరికొందరి నేతలతో ఆయన భేటీ అయ్యారు. అయితే కొందరి నాయకులతో మానిక్ రావు వేర్వేరుగా సమావేశమయ్యారు. సాయంత్రం వరకు నాయకులతో విడివిడిగా సమావేశాలు నిర్వహించిన ఆయన.. సీనియర్ ఉపాధ్యక్షులు, రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులతోనూ భేటీ అయ్యారు.
అలాగే మానిక్ రావ్ భేటీకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జగ్గారెడ్డిని ఆహ్వానించినట్లు సమాచారం. ఆ ఇద్దరు నాయకుల్లో వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అందుబాటులో లేకపోగా.. వెంకటరెడ్డి మాత్రం ఊర్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. గురువారం పార్టీ జిల్లా అధ్యక్షులతో ప్రత్యేకంగా సమావేశం కానున్న మానిక్ రావు.. పార్టీ అనుబంధ కమిటీల చైర్మన్లతోనూ భేటీ కానున్నారు.
కాగా రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకుల మధ్య నెలకొన్న వివాదాలను పక్కన పెట్టి అందరూ ఏకతాటిపై నిలిచి పార్టీ కోసం పని చేయాలని తనతో సమావేశమైన నాయకులకు మానిక్ రావ్ ఠాక్రే స్పష్టం చేస్తున్నారు. పార్టీక్యాడర్ లో ఉత్సాహాన్ని నింపేందుకు క్షేత్ర స్థాయిలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, అనుసరించాల్సిన వ్యూహాలు ఏంటని ఆరా తీసినట్లు తెలుస్తోంది.