కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగుతోంది. ఓవైపు పోటీలో ఉన్న శశిథరూర్ తగ్గేదే లేదంటూ ముందుకు వెళ్తున్నారు. నామినేషన్ ని ఉపసంహరించుకున్నారని వచ్చిన వార్తల్ని కొట్టిపారేసి.. సవాల్ నుంచి తాను వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ఇంకోవైపు మల్లికార్జున ఖర్గే సైతం దూకుడు మీదున్నారు. టీపీసీసీ నేతల మద్దతు కోసం నగరానికి వచ్చారు.
ముందుగా.. బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ఖర్గేకు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికారు. గాంధీభవన్ లో పీసీసీ ప్రతినిధులతో ఆయన సమావేశం అయ్యారు. ఏఐసీసీ అధ్యక్ష పదవి ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఖర్గే.. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల గురించి మాట్లాడారు. అలాగే బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
17న కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు ఉన్నాయని.. అందుకే అన్ని రాష్ట్రాల్లో ముమ్మరంగా పర్యటిస్తున్నానని తెలిపారు. తనకు ఓటేయాలని పీసీసీ సభ్యుల్ని కోరేందుకు హైదరాబాద్ వచ్చానని అన్నారు. 136 ఏళ్లలో నాలుగుసార్లు కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు జరిగాయన్న ఖర్గే.. చాలామంది సీనియర్లు తనకు మద్దతు ప్రకటించారని తెలిపారు. అన్ని రాష్ట్రాల్లో ప్రచారం చేస్తున్నానని.. తనకు ఓటేయమని పీసీసీ సభ్యులను కోరుతున్నట్లు చెప్పారు.
ప్రధాని మోడీ, అమిత్ షా కలిసి దేశాన్ని నాశానం చేస్తున్నారని ఆరోపించారు ఖర్గే. 70 ఏళ్లలో కాంగ్రెస్ దేశానికి ఎంతో చేసిందని, వాటిని అమ్మేస్తున్నారని విమర్శించారు. బీజేపీ చరిత్రలో ఇలాంటి ఎన్నిక ఎప్పుడూ జరగలేదని కామెంట్ చేశారు. నిరుద్యోగాన్ని తగ్గిస్తానని మోడీ గొప్పలు చెప్పారని.. కోవిడ్ తర్వాత కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయరని గుర్తు చేశారు. మోడీ పాలనలో రూపాయి విలువ రూ.82కు పెరిగిందని విమర్శించారు. బీజేపీ పాలనలో నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగాయని మండిపడ్డారు. పాల నుంచి మొదులుకుని చిన్నపిల్లలు వాడే పెన్సిళ్లు, రబ్బర్లపైనా జీఎస్టీ బాదుతున్నారని విమర్శించారు.
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు ఈనెల 17న పోలింగ్ జరగనుంది. మల్లికార్జున ఖర్గే, శశిథరూర్ నామినేషన్లు దాఖలు చేశారు. అక్టోబర్ 19న ఓట్ల లెక్కింపు చేపట్టి అదే రోజున ఫలితాలను వెల్లడించనున్నారు. 9 వేల మందికి పైగా కాంగ్రెస్ డెలిగెట్స్ ఓటు వేయనున్నారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి చివరిసారిగా 2000 నవంబర్ లో ఎన్నిక జరిగింది. ఆ ఎన్నికల్లో సోనియాగాంధీ చేతిలో జితేంద్ర ప్రసాద ఓడిపోయారు. అంతకుముందు 1997లో శరద్ పవార్, రాజేష్ పైలట్ లను సీతారాం కేస్రీ ఓడించారు.