హైదరాబాద్ లో టీపీసీసీ ఉపాధ్యక్షులతో ఏఐసీసీ ఇన్ ఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే బుధవారం భేటీ అయ్యారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ కార్యక్రమాలపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఠాక్రే నిర్వహించిన సమీక్షకు 25 మంది టీపీసీసీ ఉపాధ్యక్షులు హాజరు కాలేదు. 34 మంది టీపీసీసీ ఉపాధ్యక్షులకు గాను కేవలం 9 మంది మాత్రమే హాజరయ్యారు.
దీంతో పీసీసీ ఉపాధ్యక్షుల తీరుపై ఠాక్రే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో శుక్రవారం మరోసారి సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఎల్లుండి సమావేశానికి అందరూ తప్పక హాజరు కావాలని ఆయన స్పష్టం చేశారు. పని తీరు బాగాలేకుంటే నియోజకవర్గ ఇన్ ఛార్జ్ ల మార్పు తప్పదని మాణిక్ రావు తెలిపారు.
అనంతరం తెలంగాణలో పొత్తులపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాణిక్ రావు ఠాక్రే స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. వెంకట్ రెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారని చెప్పారు.
ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని తెలిపారు. రాహుల్ గాంధీ మాటలకు కోమటిరెడ్డి కట్టుబడి ఉన్నారన్నారు. కాంగ్రెస్ నాయకులంతా ఐక్యంగా ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్ నేతలంతా త్వరలోనే పాదయాత్ర చేస్తారని పేర్కొన్నారు .