కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర నేటితో ముగిసింది. యాత్ర ముగింపు సమావేశాన్ని శ్రీనగర్‌లో నిర్వహించారు. ఈ సభలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. ఓ వైపు మంచు కురుస్తుండగానే ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.
తాము అనుకున్నదాని కన్నా భారత్ జోడో యాత్ర బాగా విజయవంతమైందని అన్నారు. ప్రజల్లో యాత్రకు మంచి స్పందన లభించిందన్నారు. యాత్ర సమయంలో ప్రజల కష్టాలను దగ్గర నుంచి చూసి తెలుసుకున్నానన్నారు. వారి బాధలు చూసి కన్నీళ్లు పెట్టుకున్నానని పేర్కొన్నారు.
ప్రజల సహకారం లేనిదే ఏ పని ముందుకు సాగదన్నారు. ఒక సమయంలో తాను యాత్ర పూర్తి చేయగలనా? అనుకున్నానని అన్నారు. తమ ప్రభుత్వం వస్తే కశ్మీర్ కు మళ్లీ రాష్ట్ర మోదాను ఇస్తామన్నారు. బట్టలు కూడా లేని ఎంతో మంది నిరుపేదలను తాను చూశానన్నారు.
అందుకే తాను కేవలం టీషర్టు ధరించి యాత్రలో పాల్గొన్నట్లు తెలిపారు. ఈ యాత్రకు తనకు చాలా పాఠాలు నేర్పిందని పేర్కొన్నారు. ప్రజలందరి మద్దతుతోనే తాను కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర పూర్తి చేయగలిగానన్నారు. దేశ యావత్ శక్తి మనతోనే ఉందన్నారు. కశ్మీర్ ప్రజలకు ఈ దేశం అండగా ఉంటుందన్నారు.
మోడీ, అమిత్ షా ఆర్‌ఎస్‌ఎస్ లపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు. దేశంలో వారు హింసను ప్రేరేపించారని రాహుల్ ఆరోపించారు. మతం ఎప్పుడూ హింసను ప్రేరేపించదని వెల్లడించారు. మతం ప్రేమను పంచుతుందన్నారు. దేశంలోని అన్ని వర్గాలను ఏకం చేసేందుకు చేపట్టిన జోడో యాత్ర లక్ష్యం నెరవేరిందన్నారు.
మరోవైపు జోడో యాత్ర ముంగిపు సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. సోమవారం ఉదయం నుంచి మంచు వర్షం కురుసింది. ఈ క్రమంలో సభకు ఇబ్బందులు ఎదురయ్యాయి. అయినా భారీగా వచ్చిన జనాన్ని ఉద్దేశించి రాహుల్ మంచులోనే ప్రసంగించారు.