సంగారెడ్డి జిల్లాలో ఎయిర్ గన్ పేలిన ఘటన కలకలం రేపింది. ఓ ఫాంహౌస్ లో పిల్లలు ఆడుకుంటన్న సమయంలో ఇది జరిగింది. ఈ ఘటనలో నాలుగేళ్ల చిన్నారి చనిపోయింది.
వివరాల్లోకి వెళ్తే… జిన్నారం మండలం వావిలాల గ్రామ శివారులోని ఫాంహౌస్ లో పిల్లలతో కలిసి శాన్వి అనే బాలిక ఆడుకుంటోంది. అదే సమయంలో ఎయిర్ గన్ ప్రమాదవశాత్తు పేలడంతో ఆ చిన్నారి మృతి చెందింది.
పాప తల్లిదండ్రులది నిజామాబాద్ జిల్లా. వావిలాల గ్రామంలోని ఫాంహౌస్ లో పని చేస్తున్నారు. అక్కడ కోతులను, కొంగలను భయపెట్టేందుకు ఎయిర్ గన్ వాడుతుంటారు. పోలీసులకు విషయం తెలిసి ఫాంహౌస్ కు చేరుకుని విచారణ చేపట్టారు.
చిన్నారి మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఎయిర్ గన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఫాంహౌస్ నగరానికి చెందిన ప్రసాదరావు అనే వ్యక్తిదని తెలిపారు పోలీసులు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వివరించారు.