ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ మరో సారి వివాదంలో చిక్కుకొని వార్తల్లో నిలిచింది. రెండు రోజుల కిందట ఫేమస్ చెఫ్ సంజీవ్ కపూర్ విమానంలో అందించిన భోజనంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా సోమవారం కూడా మరో ప్రయాణికుడు తన వడ్డించిన భోజనంలో పరిశుభ్రత లోపించిందంటూ మండిపడ్డారు. దీనిపై ఎయిర్ ఇండియా స్పందించింది. ఆయనను క్షమాపణలు కోరింది.
ఎయిరిండియా విమానంలోని బిజినెస్ క్లాస్ లో సోమవారం ముంబై నుంచి చెన్నై వెళ్తున్న మహావీర్ జైన్ అనే ప్రయాణికుడు తనకు వడ్డించిన భోజనంలో పురుగు వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన ట్విట్టర్ షేర్ చేశారు. భోజనం ఇంత అపరిశుభ్రంగా ఉంటుందా అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ వీడియోకు ఎయిర్ ఇండియా స్పందించింది. ‘‘ప్రియమైన మిస్టర్ జైన్. మా విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో మీకు ఎదురైన అనుభవం విన్నందుకు చింతిస్తున్నాం. ఇది వినడానికి బాగాలేదు. ప్రక్రియ ప్రతీ దశలోనే పరిశుభ్రతను నిర్ధారించడానికి మేము ఖచ్చితంగా ప్రయత్నిస్తాం. మీరు మీ ప్రయాణ తేదీ, సీట్ నంబర్‌తో పాటు విమాన వివరాలను అందించగలరా ? దీనిపై సమీక్ష జరిపి, చర్యలు తీసుకుంటాం’’ అని ట్వీట్ చేసింది.
ఈ ఘటన జరిగిన ఒక రోజు కంటే ముందు కూడా ఎయిర్ ఇండియాపై ఫేమస్ చెఫ్ సంజీవ్ కపూర్ విరుచుకుపడ్డారు. విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో ఆయనకు అల్పాహారంగా అందించిన భోజనానికి సంబంధించిన ఫోటోలను ట్వీట్ చేశారు. అందులో కోల్డ్ చికెన్ టిక్కా, శాండ్‌విచ్, డెజర్ట్ ఉన్నాయి. ఈ వంటకాన్ని విమర్శిస్తూ “భారతీయులు దీన్ని అల్పాహారంగా నిజంగా తినాలా?” అని ఆయన ప్రశ్నించారు.
జనవరిలో కూడా ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. విమానంలో వడ్డించిన ఆహారంలో రాయి ఉందని జర్నలిస్ట్, బీబీసీ యూట్యూబ్ చీఫ్ సర్వప్రియా సాంగ్వాన్ రాయి ట్వీట్ చేశారు. ఎయిర్ ఇండియా ఆహారం విషయంలో ఇలా నిర్లక్ష్యంగా ఉండటం సరికాదని అన్నారు. గత ఏడాది జనవరిలో రూ.18,000 కోట్ల డీల్ ద్వారా దాదాపు ఏడు దశాబ్దాల తర్వాత ఎయిరిండియా టాటా గ్రూప్ చేతుల్లోకి వచ్చింది.