బంగారం స్మగ్లింగ్ చేస్తూ అడ్డంగా అధికారులకు చిక్కాడు ఎయిర్ ఇండియా ఉద్యోగి. 1487 గ్రాముల బంగారాన్ని తరలించేందుకు ప్రయత్నించగా.. కేరళలోని కొచ్చి ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేశారు. వయనాడ్ కు చెందిన షఫీ అనే వ్యక్తిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతని వద్ద నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
బహ్రెయిన్-కోజికోడ్-కొచ్చి మధ్య ప్రయాణించే విమానంలో షఫీ బంగారాన్ని తరలిస్తున్నట్లు అధికారులకు విశ్వసనీయ సమాచారం అందింది. బంగారాన్ని చేతులకు చుట్టుకుని, దాని మీద నుంచి షర్ట్ వేసుకుని .. గ్రీన్ ఛానల్ ద్వారా దాటే ప్రయత్నం చేసిన షఫీని కస్టమ్స్ అధికారులు చాకచక్యంతో పట్టుకున్నారు.
మరో ఘటనలో.. సింగపూర్ నుంచి వస్తున్న ఇద్దరు ప్రయాణికుల వద్ద నుంచి చెన్నై ఎయిర్ పోర్టులో సుమారు 4 కోట్ల విలువైన ఏడు కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
సింగపూర్ నుంచి చెన్నైకి వచ్చిన ఏఐ-347, 6ఈ-52 విమానాల్లో వాళ్లను పట్టుకున్నారు. నిందితులు ఇద్దరు ఎయిర్ ఇండియాకు చెందిన రెండు వేర్వేరు విమానాల్లో వచ్చారని అధికారులు తెలిపారు.