రష్యా యుద్ధం మొదలు పెట్టడంతో ఎయిర్‌పోర్టులను మూసివేసింది ఉక్రెయిన్. తూర్పు ఉక్రెయిన్ లోని గగనతలాన్ని డేంజర్ జోన్‌గా ప్రకటించింది. దీంతో ఉక్రెయిన్ పైనుంచి ఎలాంటి విమానాలు రాకపోకలు సాగించడం లేదు. దీనికి సంబంధించిన శాటిలైట్ ఇమేజ్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.
ఇటు ఉక్రెయిన్ గగనతలాన్ని మూసివేయడంతో భారత విద్యార్థులను వెనక్కి తీసుకొచ్చేందుకు కీవ్ కు బయల్దేరిన ఎయిరిండియా విమానం వెనక్కి తిరిగొచ్చేసింది. ఉక్రెయిన్ లో చాలామంది భారతీయ విద్యార్థులు చదువుకుంటున్నారు. యుద్ధ పరిస్థితుల కారణంగా విమానయాన సంస్థలు విపరీతంగా రేట్లు పెంచేయడంతో.. తమను కాపాడాలని వీడియోలను సోషల్ మీడియాలో పెట్టారు విద్యార్థులు.
ఉక్రెయిన్ లో ఉన్న విద్యార్థులను తీసుకొచ్చేందుకు గురువారం ఉదయం 7.30 గంటలకు ఢిల్లీ ఎయిర్ పోర్టు నుంచి ‘ఏఐ 1947’ ఎయిరిండియా విమానం కీవ్ కు బయల్దేరింది. ఆ తర్వాత యుద్ధం కారణంగా గగనతలాన్ని మూసేసింది ఉక్రెయిన్. ఎయిర్ మిషన్ సూచనల మేరకు అధికారులు విమానాన్ని మళ్లీ భారత్ కు మళ్లించారు.
ఇటు కీవ్ నుంచి బయల్దేరిన ఓ విమానం గురువారం ఉదయం 7.45 గంటలకు ఢీల్లీకి చేరింది. అందులో 182 మంది భారతీయులు స్వదేశానికి వచ్చారు.