అసలే నష్టాల్లో ఉన్న ఎయిర్ ఇండియా కరోనా వల్ల ఇంకా నష్టపోయింది. ఈ క్రమంలో ఆ సంస్థను కేంద్రం అమ్మకానికి పెట్టింది. అయితే ఎయిర్ ఇండియాను కొనుగోలు చేసేందుకు గతంలో టాటా గ్రూప్ ఆసక్తి చూపించింది. దీంతోపాటు ఎయిర్ ఇండియా ఉద్యోగులే ఓ సంఘంగా ఏర్పడి తమ సంస్థను తామే కొనుగోలు చేసి నడుపుకుంటామని చెప్పారు. అయితే ప్రస్తుతం తాజాగా ఎయిర్ ఇండియాలో 100 శాతం వాటాను కొనుగోలు చేస్తామని ఓ వ్యాపారి సడెన్ ఎంట్రీ ఇచ్చాడు. దీంతో ఈ విషయం ఆసక్తికరంగా మారింది.
రుయా గ్రూప్ కంపెనీ చైర్మన్ పవన్ రుయా ఎయిరిండియాలో 100 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు ఆసక్తిని చూపిస్తూ ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఈవోఐ)ను సమర్పించారు. దీంతో ఈ విషయం పారిశ్రామిక వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కోల్‌కతాకు చెందిన ప్రముఖ బిజినెస్ టైకూన్‌గా పేరుగాంచిన పవన్ రుయా ఎంట్రీ ఇవ్వడంతో పరిణామాలు మారిపోయాయి. గతంలో ఆయన డన్‌లప్ ఇండియా, ఫాల్కన్ టైర్స్, జెస్సాప్ అండ్ కంపెనీల్లో వాటాలను కొనుగోలు చేసి వాటిని శాసించే స్థాయికి ఎదిగారు. ఈ క్రమంలో ఎయిరిండియాలో ఆయన 100 శాతం వాటాను కొనుగోలు చేస్తామని ఆసక్తిని చూపించడం ఉత్కంఠను కలిగిస్తోంది.
అయితే దీనిపై రుయా ఇంత వరకు స్పందించలేదు. కానీ ఎయిరిండియా కొనుగోలుకు బిడ్డర్ల కనీస ఆస్తుల విలువ రూ.3500 కోట్లు ఉండాలి. ఇక ఈ సంస్థతోపాటు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్, ఏఐఎస్ఏటీఎస్ కంపెనీలను విక్రయించడం ద్వారా భారత ప్రభుత్వం రూ.15వేల కోట్లను సమీకరించాలని ఆలోచిస్తోంది. ఈ క్రమంలో ఎయిరిండియా ఎవరి చేతుల్లోకి వెళ్తుంది.. అన్న విషయం ఆసక్తికరంగా మారింది.