నేపాల్‌లో త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పి పోయింది. రెండు విమానాలు అత్యంత సమీపానికి వచ్చి ఢీ కొన బోయాయి. వెంటనే వార్నింగ్ సిస్టమ్స్ పైలెట్లను అలర్ట్ చేయడంతో పెను ముప్పు తప్పింది. ఈ ఘటనపై ముగ్గురు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ అధికారులను నేపాల్ పౌర విమానయాన శాఖ సస్పెండ్ చేసింది. ఇంతకు ఏం జరిగిందంటే..?
నేపాల్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎయిర్‌బస్ ఏ-320 విమానం రాజధాని ఖట్మండు నుంచి మలేషియా రాజధాని కౌలలంపూర్ కు వెళ్తోంది. సుమారు 15,000 అడుగుల ఎత్తులో ఆ విమానం ప్రయాణిస్తోంది. అదే సమయంలో ఎయిర్ ఇండియా విమానం ఒకటి అటుగా వెళుతోంది.
ఎయిర్ఇండియా విమానాన్ని 19,000 అడుగుల నుంచి పైలట్ కిందకు దించుతున్నాడు. దీంతో వార్నింగ్ సిస్టమ్స్ పైలెట్స్‌ను హెచ్చరించాయి. ఈ క్రమంలో అధికారులు వెంటనే అలర్ట్ అయ్యారు. ఎయిర్ బస్ ఏ-320ని 7,000 అడుగుల కిందకు దించారు. దీంతో ప్రమాదం తప్పి పోయింది.
ఈ ఘటనపై నేపాల్ పౌరవిమానయాన శాఖ సీరియస్ అయింది. విచారణకు ఆదేశాలు జారీ చేసింది. దర్యాప్తు జరిపేందుకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. సమగ్ర దర్యాప్తు జరిపి నివేదికను అందించాలని కమిటీని ఆదేశించింది. ముగ్గురు అధికారులను సస్పెండ్ చేసింది. ఈ ఘటనపై ఎయిర్ ఇండియా మాత్రం ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం.