అమెరికా నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. విమానంలో ఇంజన్ నుంచి ఆయిల్ లీకవుతున్నట్టు సిబ్బంది గుర్తించారు. దీంతో బోయింగ్ 777 -300ఈ ఆర్ విమానాన్ని స్వీడన్ లోని స్టాక్ హోమ్ లో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు.
విమానంలో 300 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణీకులంతా సురక్షితంగా ఉన్నట్టు ఎయిర్ లైన్స్ ప్రకటించింది. నెవార్క్ నుంచి బయలు దేరిన కొద్ది సేపటికే ఇంజన్ నుంచి ఆయిల్ లీకవుతున్నట్టు పైలట్లు గుర్తించారు. దీంతో వెంటనే పైలట్ అప్రమత్తమై ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.
ల్యాండింగ్ సమయంలో మంటలు చెలరేగే అవకాశం ఉండటంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ముందు జాగ్రత్త చర్యల కింద ఫైర్ ఇంజన్లను విమానాశ్రయం వద్ద మోహరించారు. కానీ విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఆయిల్ లీక్ కావడంతో విమానంలో ఒక ఇంజన్ ఆగిపోయిందని డీజీసీఏ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. వెంటనే స్టాక్ హోమ్‌లో ల్యాండింగ్ చేయడంతో పెను ప్రమాదం తప్పిందని ఆయన వెల్లడించారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని ఆయన వివరించారు.