ప్రభుత్వ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా.. సుదీర్ఘ కాలం తర్వాత మళ్లీ టాటా గ్రూప్ వశమయ్యేలా ఉంది. 67 ఏళ్ల క్రితం టాటా గ్రూప్ నిర్వహించిన ఎయిర్ ఇండియాను భారత ప్రభుత్వం తమ నియంత్రణలోకి తీసుకోగా.. ఇప్పుడు అనూహ్యంగా మళ్లీ అదే కంపెనీ చేతుల్లోకి వెళ్లేలా కనిపిస్తోంది.
పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన ఎయిరిండియా విమానయాన సంస్థను కేంద్రం ఇటీవల అమ్మకానికి పెట్టింది. దీంతో ఎయిర్ ఇండియాను కొనుగోలు చేసేందుకు టాటా గ్రూప్ ఆసక్తి చూపిస్తోంది. అయితే టాటా గ్రూప్ నేరుగా ఎయిర్ ఇండియాను కొనుగోలు చేయకుండా.. టాటా సన్స్ నిర్వహిస్తున్న ఎయిర్ ఆసియా ఇండియా ద్వారా చేజిక్కించుకునేందుకు సిద్ధమవుతోంది.
మరోవైపు ఎయిర్ ఇండియా సంస్థలోనే పనిచేస్తున్న 200 ఉద్యోగులు ఉమ్మడిగా ఈ సంస్థను కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే తమ తరపున ఓ ఇన్వెస్టర్‌ను కూడా వెతికిపట్టుకున్నారు. ఈ సాయంత్రం డెడ్‌లైన్‌గా ఉన్న.. ప్రభుత్వ బిడ్‌లో పాల్గనేందుకు వారు కూడా సిద్ధమవుతున్నారు. ఇక స్పైస్ జెట్ అధినేత కూడా ఎయిర్ ఇండియా వేలంలో పాల్గొంటారని తెలుస్తోంది. కాగా 2018లో ఇదే ఎయిర్ ఇండియాలో వాటాను అమ్మకానికి పెట్టినప్పుడు ఎవరూ కొనుగోలుకు ముందుకు రాలేదు. కానీ ఈ సారి మాత్రం భారీ స్పందన రావడం విశేషం. బిడ్డింగ్ ప్రక్రియ ఇవాళ సాయంత్రంతో ముగుస్తుండగా… డిసెంబర్ 28 లోపు అర్హుల జాబితాను అనౌన్స్ చేస్తారు.
1932లో టాటా ఎయిర్‌లైన్స్ పేరుతో టాటా గ్రూప్ సంస్థను ప్రారంభించగా.. 1946లో ఎయిర్ ఇండియాగా మార్చారు. అయితే 1953లో ఎయిర్ఇండియాను కేంద్ర ప్రభుత్వం తమ నియంత్రణలోకి తీసుకుంది.