భారత ఏవియేషన్ చరిత్రలో అతి భారీ డీల్ కుదిరింది. ఫ్రాన్స్ కు చెందిన ప్రముఖ విమాన తయారీ సంస్థ ఎయిర్ బస్ నుంచి 250 విమానాల కొనుగోలు కోసం టాటాలకు చెందిన ఎయిరిండియా ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకు సంబంధించిన అవగాహనా ఒప్పందంపై సంతకాలు చేసినట్టు టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ తెలిపారు. మంగళవారం వర్చ్యువల్ గా నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని మోడీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మేక్రాన్, రతన్ టాటా, కేంద్ర మంత్రులు పీయూష్ గోయెల్, జ్యోతిరాదిత్య సింధియా, ఎయిర్ బస్ ప్రతినిధులు పాల్గొన్నారు.
మొత్తం 250 విమానాల్లో 40 వైడ్ బాడీ కలిగిన ఏ 350 విమానాలు, మిగిలిన 210 విమానాలు నారో బాడీ కలిగినవి ఉంటాయని చంద్రశేఖరన్ చెప్పారు. వీటిలోని తేడాను వివరిస్తూ ఆయన.. వైడ్ బాడీ విమానాలను సుదూర ప్రయాణాలకు వినియోగించుకోవచ్చునన్నారు. 17 ఏళ్ళ తరువాత ఎయిరిండియా చేపట్టిన తొలి ఆర్డర్ ఇదని, మరో 250 విమానాలను అమెరికాకు చెందిన బోయింగ్ సంస్థ నుంచి కూడా కొనుగోలు చేసే అవకాశం ఉందని తెలిపారు.
ఎయిర్ బస్ తో కుదుర్చుకున్న ఒప్పందానికి సంబంధించి దాదాపు 50 బిలియన్ డాలర్లకన్నా ఎక్కువ విలువైన 40 వైడ్ బాడీ విమానాలు ఇండియాకు రానున్నాయి. ఎయిర్ బస్ తో తమకు మంచ్చి సంబంధాలు ఉన్నాయని, ఆ సంస్థ నుంచి ఈ డీల్ కుదుర్చుకోవడం తమకెంతో సంతోషంగా ఉందని చంద్రశేఖరన్ చెప్పారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని మోడీ.. భారత్ చేబట్టిన ‘మేకిన్ ఇండియా.. మేక్ ఫర్ ది వరల్డ్’ విజన్ కింద ఏరోస్పేస్ ఉత్పాదక రంగంలో అనేక కొత్త అవకాశాలు వస్తున్నాయని అన్నారు. ఇది ఇండో-పసిఫిక్ లో సెక్యూరిటీ, సుస్థిరత వంటివాటికే గాక.. గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీకి, హెల్త్ సెక్యూరిటీకి కూడా ఎంతో తోడ్పడేదిగా ఉంటుందని ఆయన చెప్పారు. ఇండియా, ఫ్రాన్స్.. కలిసికట్టుగా ఈ విధమైన అంశాల్లో కృషి చేయడం హర్షదాయకమన్నారు. రానున్న 15 ఏళ్లలో భారత వైమానిక రంగానికి 2 వేలకు పైగా విమానాల అవసరం ఉంటుందని మోడీ పేర్కొన్నారు.