ఏదైనా పనిఉండి బయటకు వెళ్లాలంటే వెంటనే గుర్తుకొచ్చేది ట్యాక్సీ. ఇప్పటి వరకు కారు ట్యాక్సీలో ప్రయాణం చేశాం. కానీ.. ఇప్పుడు ప్రజలకు ఎయిర్ ట్యాక్సీ అందుబాటులోకి వచ్చింది. త్వరలోనే గాల్లో రయ్యిమంటూ వెళ్లేందుకు అందుబాటులోకి రాబోతున్నాయి. దేశంలోని కొన్ని కంపెనీలు ఎయిర్ ట్యాక్సీలను తయారు చేస్తున్నట్టు తెలుస్తోంది.
తాజాగా.. ఈ-ప్లేన్ అనే సంస్థ ఈ-20 పేరుతో ఎయిర్ ట్యాక్సీ నమూనాను రూపొందించింది. ఇది హెలికాప్టర్లాగా గాలిలో ఎగురడమే కాకుండా.. నేలపై ల్యాండ్ అవుతుందని సంస్థ నిర్వాహకులు వెల్లడించారు. పైలట్ తో పాటు.. ఒక ప్రయాణికుడు కూర్చునే విధంగా రెండు సీట్లు మాత్రమే ఉంటాయని తెలిపారు. దీన్ని రూపొందించడానికి 12 ప్లాస్టిక్ పేపర్ రోటర్ లను అమర్చారని పేర్కొన్నారు.
ఈ ట్యాక్సీ గరిష్ఠంగా గంటకు 200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడంతోపాటు.. 3000 మీటర్ల ఎత్తు వరకు వెళుతుందని నిర్వాహకులు తెలిపారు. అయితే.. ఇది ఇంకా అభివృద్ధి దశలోనే ఉందని రూపకర్తలు తెలిపారు. ఎయిర్ ట్యాక్సీ ఇంటి పైకప్పు నుంచి రాకపోకలను సాగించేలా తయారు చేశామని చెప్పారు రూపకర్తలు.
ఈ-20 ఎయిర్ ట్యాక్సీ 5 మీటర్ల పొడవు.. 5 మీటర్ల వెడల్పుతో ఉంటోందని తెలిపారు. 3 మీటర్ల పొడవు, 3 మీటర్ల వెడల్పుతో మరోక చిన్న మోడల్ ను తయారు చేస్తున్నామని స్పష్టం చేశారు. దీనికి ఈ-50 అని పేరు పెడుతున్నట్టు ప్రకటించారు నిర్వాహకులు. ఇంజిన్ పనులు పూర్తి అవుతోందని.. ఈ విమానం మొదటి ట్రయల్ 2023 నాటికి జరుగుతుందని చెప్పారు.