ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన కార్గో విమానం హైదరాబాద్ కు వచ్చింది. ఎయిర్ బస్ బెలూగా విమానం హైదరాబాద్‌లో దిగింది. ఈ నేపథ్యంలో బెలూగాకు హైదరాబాద్ ఎయిర్ పోర్టు వర్గాలు స్వాగతం పలికాయి.
గత రాత్రి శంషాబాద్ ఎయిర్ పోర్టులో విమానం ల్యాండ్ అయింది. ఈ భారీ విమానం ఎయిర్ పోర్టులో ల్యాండ్ కానున్న నేపథ్యంలో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ విమానం ఈ రోజు రాత్రి 7.20 నిమిషాల వరకు హైదరాబాదులోనే ఉంటుంది.
అత్యంత భారీ విమానాల్లో ఒకటైన ఏఎన్ ఆంటోనోవ్ కార్గో విమానం కూడా 2016లో ఇక్కడి విమానాశ్రయంలో దిగింది. ఆ సమయంలో కూడా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
తమ విమానాశ్రయంలో మౌలిక సదుపాయాలు, సాంకేతిక వనరులు పుష్కలంగా ఉన్నాయని ఎయిర్ పోర్టు వర్గాలు వెల్లడించాయి. భారీ విమానాలు సైతం సులభంగా ల్యాండ్ కావడం అందుకు నిదర్శనమని పేర్కొన్నాయి.
ఎయిర్ బస్ సంస్థ తయారుచేసిన ఈ బెలూగా విమానం పొడవు 56 మీటర్లు, బరువు 95 టన్నులు. ఇది 56 అడుగుల ఎత్తు ఉంటుంది. ఎయిర్ బస్ సంస్థ దీన్ని ఒక తిమింగలం రూపంలో డిజైన్ చేసింది.