ఎయిరిండియా-ఎయిర్ బస్ మధ్య విమానాల కొనుగోలు డీల్ పట్ల అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాల అధినేతలు ఇండియాపై ప్రశంసల వర్షం కురిపించారు. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ వరుసగా ప్రధాని మోడీని అభినందించారు. 250 విమానాల కొనుగోలుకు ఫ్రాన్స్ కు చెందిన ఎయిర్ బస్ తో నిన్న టాటా సన్స్, ఎయిరిండియా చైర్మన్ చంద్రశేఖరన్ ఒప్పందం కుదుర్చుకున్నారు. వర్చ్యువల్ గా జరిగిన ఈ కార్యక్రమంలో మోడీ, కేంద్ర మంత్రులు పీయూష్ గోయెల్, జ్యోతిరాదిత్య సింధియా, ఇతర అధికారులు కూడా పాల్గొన్నారు.
అమెరికాకు చెందిన బోయింగ్ కంపెనీ నుంచి కూడా సుమారు 250 విమానాలను ఎయిరిండియా కొనుగోలు చేయనుంది. ఈ ఒప్పందం వల్ల తమ దేశంలో 44 రాష్ట్రాల్లో సుమారు 10 లక్షలమందికి పైగా ఉద్యోగావకాశాలు పొందగలరని, చాలామందికి నాలుగేళ్ల కాలేజీ డిగ్రీ కూడా అవసరం కాకపోవచ్చునని అమెరికా అధ్యక్షుడు బైడెన్ తెలిపారు. నిన్న ఆయన మోడీకి ఫోన్ చేసి అభినందిస్తూ.. భారత-అమెరికా దేశాల మధ్య సంబంధాల పరిపుష్టతకు ఇది ఎంతో దోహదం చేస్తుందన్నారు.
ఎయిర్ బస్, బోయింగ్ సంస్థల నుంచి దాదాపు 470 వైడ్ బాడీ, నారో బాడీ విమానాలను సుమారు 80 బిలియన్ డాలర్ల వ్యయంతో కొనుగోలు చేయాలన్నది ఎయిరిండియా లక్ష్యం. ఇది నిజంగా ‘ల్యాండ్ మార్క్ డీల్’ అని బైడెన్ అభివర్ణించారు. ఇక.. కొన్ని దశాబ్దాల కాలంలోనే ఇండియాకు సంబంధించి ఇది అతి పెద్ద ఎక్స్ పోర్ట్ డీల్ అని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ట్వీట్ చేశారు. తమ దేశ ఏరో స్పేస్ రంగానికి కూడా ఈ ఒప్పందం ఎంతో మేలు చేస్తుందన్నారు.
ఎకానమీని పెంచుకోవాలన్న తమ అయిదు ప్రాధాన్యతల్లో ఒకదానికి ఈ డీల్ తోడ్పడుతుందనడంలో సందేహం లేదన్నారు. ఎయిరిండియా, ఎయిర్ బస్, రోల్స్ రాయిస్ మధ్య ఒడంబడిక కుదిరిందంటే మా దేశ ఏరో స్పేస్ రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఇక ఆకాశమే హద్దుగా తాము పరిగణిస్తున్నామన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ కూడా ఇలాగె స్పందిస్తూ ట్వీట్ చేశారు. భారత్, ఫ్రాన్స్ దేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ఈ డీల్ మరింతగా తోడ్పడుతుందని ఆయన పేర్కొన్నారు.