ఎయిరిండియా విమానంలో మూత్ర విసర్జన ఘటనను తీవ్రంగా పరిగణించిన పౌర విమానయాన శాఖ (డీజీసీఏ) ఈ ఎయిర్ లైన్స్ కి 30 లక్షల రూపాయల జరిమానా విధించింది. ఈ విమాన పైలట్ ని మూడు నెలలపాటు సస్పెండ్ చేసింది. పైగా డైరెక్టర్ ఆఫ్ ఇన్-ఫ్లయిట్ సర్వీస్ కి 3 లక్షల ఫైన్ కూడా విధించినట్టు ఈ శాఖ వర్గాలు తెలిపాయి. గత ఏడాది నవంబరు 26 న న్యూయార్క్ నుంచి న్యూఢిల్లీ వస్తున్న ఈ విమానంలో మద్యం తాగిన మత్తులో శంకర్ మిశ్రా అనే వ్యక్తి ఓ మహిళా ప్రయాణికురాలిపై మూత్రవిసర్జన చేసిన ఘటన దేశవ్యాప్తంగా దుమారం సృష్టించింది.
ఈ ఘటనలో డీజీసీఏ నిబంధనల ఉల్లంఘన జరిగిందని, ఎయిర్ క్రాఫ్ట్ రూల్ 141 ని పైలట్-ఇన్-కమాండ్ అతిక్రమించాడని, అందువల్ల అతని లైసెన్స్ ని మూడు నెలల పాటు సస్పెండ్ చేస్తున్నామని ఈ సంస్థ తెలిపింది. అలాగే ఇన్-ఫ్లయిట్ సర్వీసెస్ డైరెక్టర్ కూడా తన బాధ్యతలను నిర్వర్తించడంలో విఫలమయ్యారని పేర్కొంది.
బెంగుళూరులో శంకర్ మిశ్రాని అరెస్ట్ చేసిన పోలీసులు అతడిపై వివిధ సెక్షన్ల కింద కేసు పెట్టారు. ఆ తరువాత శంకర్ మిశ్రా .. బాధితమహిళకు పరిహారం చెల్లించానని, తమ మధ్య వివాదం పరిష్కారమైందని అధికారులకు తెలిపాడు. అయితేఇందులో తన క్లయింట్ తప్పేమీ లేదని, బాధిత మహిళే తనపై తాను మూత్రం పోసుకుందని ఇతని తరఫు లాయర్ ..కోర్టుకు తెలిపాడు.
ఆమె ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను కూడా ప్రస్తావిస్తూ… 30 ఏళ్లుగా భరతనాట్యం డ్యాన్సర్ అయిన ఆమెకు ఇలాంటి సమస్య ఉండడం సహజమేనని అన్నాడు. ఆమెకు ఏదో శారీరక సమస్య ఉన్నట్టు కనిపిస్తోందన్నాడు. ఈ కేసులో శంకర్ మిశ్రా ప్రస్తుతం జుడిషియల్ కస్టడీలో ఉన్నాడు.