168 మంది ప్రయాణికులతో కాలికట్ నుంచి సౌదీ అరేబియాలోని దమ్మమ్ సిటీకి వెళ్తున్న ఎయిరిండియా విమానాన్ని అత్యవసరంగా శుక్రవారం తిరువనంతపురంలో దింపారు. సాంకేతిక లోపం కారణంగా విమానాన్ని తిరువనంతపురంలో దింపినట్టు ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ వర్గాలు తెలిపాయి
. విమానం తోక భాగంలో సమస్య ఉత్పన్నమైందని ఈ వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ ఘటనలో ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నట్టు వివరించాయి.
ఈ సంఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించారు. ఈ నెల 19 న కూడా దుబాయ్ నుంచి కేరళ రాజధానికి వస్తున్న ఎయిరిండియా విమానం అత్యవసరంగా ఇక్కడి విమానాశ్రయంలో దిగింది.
156 మంది ప్రయాణికులతో ఇది దుబాయ్ నుంచి బయల్దేరింది. ఇప్పటికే ఈ సంస్థ విమాన సర్వీసుల విషయంలో అనేక ఫిర్యాదులు వెల్లువెత్తిన తరుణంలో తాజా ఘటన నేపథ్యంలో ఎయిరిండియా వైమానిక సంస్థ సామర్థ్యంపై సందేహాలు తలెత్తుతున్నాయి.