సాధారణంగా మనం బయట రోడ్లపై తిరిగే బస్సుల్లో రెండు వెరైటీల బస్సులు మనకు కనిపిస్తుంటాయి. రెండు ద్వారాలు ఉండేవి. ఒకటే ద్వారం ఉండేవి. రెండు ద్వారాలు ఉండే వాటిని సిటీల్లో, పల్లెల్లో తిరిగేందుకు ఉపయోగిస్తారు. ఒక ద్వారం ఉండే బస్సులను సహజంగానే సుదీర్ఘ సమయం పాటు వెళ్లాల్సి వచ్చే మార్గాల్లో ఉపయోగిస్తారు. అయితే ఎయిర్ పోర్టులలో ఉపయోగించే బస్సులు మాత్రం వీటికి చాలా భిన్నంగా ఉంటాయి.
ఎయిర్‌పోర్టులలో ప్రయాణికులను గేటు నుంచి విమానాల వద్దకు తీసుకెళ్లే బస్సులు విశాలంగా, పెద్దగా ఉంటాయి. ఇక వాటి గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇక వాటిల్లో కూర్చునేందుకన్నా నిలబడేందుకే ఎక్కువ స్థలం ఉంటుంది. ఇలా ఆ బస్సులు భిన్నంగా ఎందుకు ఉంటాయంటే..?
ఎయిర్‌పోర్టులలో ఉండే బస్సులను కేవలం ఆ ప్రాంతంలోనే తిప్పేందుకు ఉపయోగిస్తారు. అవి చాలా చాలా తక్కువ దూరం ప్రయాణిస్తాయి. దీనికి తోడు ఎయిర్ పోర్టుల్లో స్పీడ్ బ్రేకర్లు ఉండవు. అందువల్ల వాటి గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువగా ఉంటుంది. ఇలా ఉండడం వల్ల ప్రయాణికులు త్వరగా బస్సు ఎక్కవచ్చు. చాలా సమయం ఆదా అవుతుంది. అలాగే ప్రయాణించే దూరం కూడా చాలా తక్కువ కనుక సీట్ల కోసం వెదకాల్సిన పని ఉండదు. వాటిలో ఎక్కి నిలుచుంటే 5, 10 నిమిషాల్లో విమానం వద్దకు వెళ్లవచ్చు. కనుక సీట్ల కోసం కాకుండా నిలుచునేందుకు అనువుగా వాటిని రూపొందిస్తారు.
ఎయిర్‌పోర్టుల్లో ఉపయోగించే బస్సుల వల్ల సమయం ఆదా అవడమే కాదు, ఒకేసారి ఎక్కువ మందిని తీసుకెళ్లవచ్చు. సాధారణ బస్సులు అయితే 60 మందికి చాన్స్ ఉంటుంది. కానీ ఎయిర్ పోర్టు బస్సుల్లో ఒకేసారి 160 మందిని తీసుకెళ్లవచ్చు. దీంతో ప్రయాణికులను వేగంగా విమానాల వద్దకు, గేట్ల వరకు చేరవేయవచ్చు. దీంతో సమయం కలసి వస్తుంది. అందుకనే, ఇన్ని లాభాలు ఉన్నాయి కనుకనే ఎయిర్‌పోర్టులలో భిన్న రకాల బస్సులను ఉపయోగిస్తారు.