విమాన ప్రయాణంలో కరోనా మార్గదర్శకాలను సరిగ్గా పాటించకపోయినా.. ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరించినా ఉన్నపళంగా ప్రయాణికులను దింపివేయాలని డీజీసీఏ ఇటీవల ఆదేశించడంతో.. విమానయాన సంస్థలు కఠినంగా వ్యవహరిస్తున్నాయి. ఈ క్రమంలో ఇండిగో, ఎయర్, అలాగే ఎయిర్ ఆసియా తమ విమానాల్లో ప్రయాణిస్తూ .. కరోనా మార్గదర్శకాలను పాటించని ఏడుగురు ప్రయాణికులను నిర్దాక్షిణ్యంగా దింపివేసాయి. మరోసారి ఇదే విధంగా ప్రవర్తిస్తే విమాన ప్రయాణాలపై నిషేధం విధిస్తామని హెచ్చరించాయి.
దేశంలో కరోనా వైరస్ మళ్లీ తీవ్రరూపం దాలుస్తున్నా.. విమానాల్లో కొందరు ప్రయాణికులు మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఎయిర్‌పోర్ట్‌లో అడుగుపెట్టింది మొదలు.. విమానం ప్రయాణం ముగించుకుని మరో ఎయిర్‌పోర్ట్ నుంచి వెళ్లిపోయే వరకు కచ్చితంగా మాస్క్‌లు పెట్టుకోవాల్సిందేనని ఇటీవల ప్రయాణికులకు డీజీసీఏ సూచించింది. మాస్కులు లేకుండా ప్రయాణికులు ఎయిర్ పోర్టు లోనికి వస్తే అనుమతించకూడదని సీఐఎస్ఎఫ్ ను కూడా ఆదేశించింది.