టీఎస్పీఎస్సీలో జరిగిన ప్రశ్నాపత్రాల లీకేజీ ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించాలంటూ ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ప్రగతి భవన్ ను ముట్టడించారు. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్న టీఎస్పీఎస్సీ చైర్మన్ ని తక్షణమే బర్తరఫ్ చేయాలన్నారు.
ఈ సందర్బంగా రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ నినాదం అయినటువంటి నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంపై తెలంగాణ ఉద్యమ పోరాటంలో విద్యార్థులు కీలక పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారని తెలిపారు. ఆనాటి విద్యార్థులే.. నేటి నిరుద్యోగులని.. ప్రశ్నాపత్రాల లీకేజీ వలన 30 లక్షల మంది నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారని ప్రభుత్వంపై మండిపడ్డారు.
ఈ ఘటనపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని, బాధ్యులను కఠినంగా శిక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. రోడ్డుపై ర్యాలీగా వెళ్లారు ఏఐఎస్ఎఫ్ నాయకుడు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఈ ర్యాలీలో ఇటిక్యాల రామకృష్ణ, గ్యార నరేష్, గర్ల్స్ కన్వీనర్ నాగజ్యోతి, రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘురాం, రాజు, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పీ శివ, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు మెట్టల చైతన్య, రాష్ట్ర నాయకులు పవన్ చౌహన్, నాయకులు శృతి, విజయ్ , ఆకాష్, శ్రీకాంత్, శివ, తదితరులు పాల్గొన్నారు.