టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ.. బీజేవైఎం ఆధ్వర్యంలో సైదాబాద్ ప్రధాన రహదారిపై సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి మాట్లాడుతూ.. టీఎస్పీఎస్సీ చైర్మన్ ని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. అనేకమంది విద్యార్థులు ఆత్మ బలిదానాలతోనే తెలంగాణ ఏర్పడిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
తెలంగాణలో గడిచిన ఎనిమిది సంవత్సరాలుగా నోటిఫికేషన్లు విడుదల చేయలేదని, లేక లేక విడుదల చేసిన నోటిఫికేషన్లలో అవకతవకలు జరగడం అన్యాయమన్నారు. ప్రశ్నా పత్రం లీకేజీ జరగడం అంటే టీఎస్పీఎస్సీ అధికారులు పరీక్షల నిర్వహణలో ఎంత అలసత్వంగా, ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అర్థమవుతుందన్నారు.
ఏఈ పరీక్ష పేపర్ లీకేజీతో పాటు మరికొన్ని పరీక్షల పేపర్లు కూడా లీకేజీ అయినట్లు వస్తున్న వార్తలపై హై కోర్టు సిట్టింగ్ జడ్జి చేత సమగ్ర విచారణ జరిపించాలన్నారు మనికంఠ రెడ్డి. రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగ ప్రకటనల కోసం వేచి చూస్తూ కోచింగ్ సెంటర్లకు లక్షలాది రూపాయలు కట్టి పరీక్షలకు సన్నద్ధం అయి పరీక్షలకు వస్తుంటే కొందరు పరీక్ష పత్రాలు లీకేజీ చేసి లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని దుయ్యబట్టారు.
పరీక్షలు సక్రమంగా నిర్వహించడం చేతకాని స్థితిలో టీఎస్పీఎస్సీ ఉందని, లీకేజీ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ అధికారులు, టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యులు రాజీనామా చేయాలని మణికంఠ రెడ్డి డిమాండ్ చేశారు. 30 లక్షల మంది విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని తెలిపారు మనికంఠ. ఈ కార్యక్రమంలో జగన్ మోహన్, సాయి సాగర్, ఆశిష్ గౌలికర్, ఈశ్వర్ యాదవ్ లు, బీజేఎం కార్యకర్తలు పాల్గొన్నారు.