ఆమె అలా కనిపిస్తే చాలు మనసుకు రెక్కెలొచ్చేస్తాయి.. లోపలున్న కవి సార్వభౌముడు నిద్ర లేస్తాడు. ‘‘నిను చూస్తూ మైమరిచి నాలో నేను మురిసిపోతున్నా.. నా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఆదమరుస్తున్నా.. నీ రూపాన్ని ఊపిరిలా నాలో నింపుకుంటున్నా’’ అంటూ కవితా ప్రవాహాన్ని వదులుతాడు. ఎందుకంటే.. ఆమెను చూస్తుంటే ప్రపంచంలోని అందమంతా వచ్చి కంటి ముందు సాక్షాత్కరమయిందా అన్నట్లు ఉంటుంది కాబట్టి. ఇప్పటికే మీకు అర్థం అయ్యే ఉంటుంది ఎవరి గురించి చెబుతున్నామో. 48 ఏళ్ల వయసులోనూ వన్నె తగ్గని అందంతో సినిమాలు, అంతర్జాతీయ ఈవెంట్స్ లో మెరుస్తున్న ఐశ్వర్య రాయ్.
తాజాగా 75వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో తళుక్కున మెరిసిన ఐశ్వర్య.. గత 21 సంవత్సరాలుగా ఇలాంటి అంతర్జాతీయ ఈవెంట్స్ లో పాల్గొంటూ వస్తోంది. వెండితెరపై వెన్నెల కురిపించే ఆ అందంపై తాజాగా సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర చర్చ జరుగుతోంది. దానికి కారణం లేకపోలేదు. సినిమాల్లోకి రాకముందు అప్పుడప్పుడే మోడల్ గా ఎదుగుతున్న సమయంలో ఐశ్వర్యకు సంబంధించిన ఓ అగ్రిమెంట్ కాపీ ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.
1994లో మిస్ వరల్డ్ అయిన ఐష్.. అంతకంటే ముందే మోడలింగ్ చేసేది. అలా ఆమె పాల్గొన్న ఒక మ్యాగజైన్ తాలూకూ ఫోటోషూట్ 1992లో జరిగింది. అంటే.. అప్పటికి ఐష్ వయసు 18 ఏళ్లు. సాదాసీదా అప్ కమింగ్ మోడల్ గా కృపా క్రియేషన్స్ అనే సంస్థ కోసం ఆమె కెమెరా ముందుకొచ్చింది. సల్వార్ కమీజ్ ధరించి ఫోజులిచ్చింది. అయితే, సదరు ఫ్యాషన్ క్యాటలాగ్ కోసం ఐశ్వర్య అందుకున్న ఫీజు తెలిస్తే షాకవ్వాల్సిందే. అక్షరాలా 15 వందల రూపాయలు.
ఐష్ కు 15 వందల రూపాయలను చెక్కు ద్వారా చెల్లించింది సదరు సంస్థ. ఈ విషయం కూడా స్పష్టం చేస్తూ బిల్ పైన సంతకం చేసింది ఐష్. ప్రస్తుతం దీనికి సంబంధించిన అగ్రిమెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.