ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో ఆతిథ్య జట్టుపై భారత్ పైచేయి సాధించే దిశగా పయనిస్తుంది. ఈ బాక్సింగ్ డే టెస్టులో కెప్టెన్ అజింక్యా రహానే సెంచరీ కొట్టాడు. 195 బంతుల్లో 11 ఫోర్లతో 100 పరుగులు పూర్తి చేశాడు. టెస్టుల్లో అతనికిది 12వ సెంచరీ.
రెండో రోజు ఆట ప్రారంభం నుండి ఓవైపు వికెట్లు పడుతున్నా రహానే మాత్రం ఆసీస్ బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తున్నాడు. వరుసగా పుజారా, గిల్, పంత్ ఔటైనా… రవీంద్ర జడేజా సహకారంతో ఇన్నింగ్స్ ను నడిపిస్తున్నాడు. రహానేకు తోడుగా క్రీజులో రవీంద్ర జడేజా(36) ఉన్నాడు. ఇద్దరూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తూ.. ప్రస్తుతానికి 73 పరుగుల ఆధిక్యంలో ఉంచారు. ప్రస్తుతం టీమిండియా స్కోర్ 88 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 268 పరుగులు.
ఈ భాగస్వామ్యాన్ని విడదీసేందుకు ఆసీస్ బౌలర్లు చెమటోడ్చుతున్నారు.